- అమ్మకాలపై అమెరికా ఆంక్షలు విధించే ప్రమాదం
- అనుమతులూ ఆలస్యమయ్యే అవకాశం
- ఇండియా రేటింగ్స్ వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ, సుంకాల వంటి సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ ఫార్మా కంపెనీలను కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ (యూఎస్ఎఫ్డీఏ) చేస్తున్న తనిఖీల్లో భారీగా లోపాలు బయటపడుతున్నాయి. సుమారు 17 శాతం తనిఖీల్లో తీవ్రమైన సమస్యలు బయటపడ్డాయని ఇండియా రేటింగ్స్ రిపోర్ట్ వెల్లడించింది. డేటా సరిగ్గా లేకపోవడం, కలుషిత పదార్థాలు ఉండటం, ఆడిట్ ట్రైల్స్ తొలగింపు, క్వాలిటీ కంట్రోల్ ఫెయిల్యూర్స్, నిర్వహణ లోపాలను గుర్తించారు. దీంతో ఎఫ్‌డీఏ ఇండియా ప్లాంట్లలో తయారయ్యే మందుల విక్రయాలపై ఆంక్షలు విధిస్తారని భావిస్తున్నారు.
కొత్త మందుల ఆమోదంలో ఆలస్యానికి దారితీసే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన, తీవ్రతను బట్టి అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎఫ్‌డీఏ పరిశీలనలో లోపాలు కనిపిస్తే ఆ తనిఖీని అఫీషియల్ యాక్షన్ ఇండెక్స్ (ఓఏఐ) కేటగిరీలో చేరుస్తారు. నిబంధనలను పాటించని కంపెనీలపై మరింత నిఘా పెడతారు. భారతీయ ఫార్మా కంపెనీలపై ఎఫ్డీయే ఓఏఐల శాతం పెరుగుతూనే ఉంది. 2014 సంవత్సరంలో ఇది 23 శాతంగా ఉండగా, 2024 నాటికి 11 శాతానికి తగ్గింది. ప్రస్తుతం మళ్లీ 17 శాతానికి పెరిగింది.
అమెరికాలో తగ్గుతున్న అమ్మకాలు
అమెరికా మార్కెట్ భారతీయ ఫార్మా సంస్థలకు అత్యంత కీలకం. అక్కడ అమ్ముడయ్యే జెనరిక్ మెడిసిన్స్‌లో దాదాపు 47 శాతం భారత కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. భారత ఫార్మా ఎగుమతుల్లో 38 శాతం యూఎస్‌కే వెళ్తున్నాయి. ఇండ్-రా రేటింగ్ పొందిన కంపెనీల ఆదాయంలో 35 శాతం వాటా అమెరికా మార్కెట్ నుంచే వస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో అమెరికా మార్కెట్లో వీటి విక్రయాలు 1.7 శాతం తగ్గాయి. 2027 మొదటి త్రైమాసికంలో ఈ తగ్గుదల 5.8 శాతానికి చేరింది.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కంపెనీలు సింగిల్ ప్రొడక్ట్ లేదా ఒక్క దేశంపైనే ఆధారపడటం తగ్గించుకోవాలి. ఒకే డ్రగ్‌పై ఆధారపడకుండా రకరకాల వ్యాధులకు మందులను ఉత్పత్తి చేయాలి. మరిన్ని మార్కెట్లలో అడుగుపెట్టాలి. అయితే కొత్త మార్కెట్లలోకి వెళ్లడం అంత ఈజీ కాదు. డ్రగ్స్‌కు అనుమతులు పొందడం, పరిశోధనల ఖర్చులు, సాంకేతిక సామర్థ్యాల పెంపు వంటి అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. విదేశీ మార్కెట్లో విస్తరణ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. భవిష్యత్తులో కంపెనీల వృద్ధి కాంప్లెక్స్ జెనరిక్స్ తయారీ, నూతన ఆవిష్కరణలు, మార్కెట్ పోటీపై ఆధారపడి ఉంటుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది.
