దసరా సీజన్ లో.. కార్ల అమ్మకాలు డల్

 దసరా సీజన్ లో.. కార్ల అమ్మకాలు డల్

న్యూఢిల్లీ: పండుగల వేళ బండ్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కిందటేడాది నవరాత్రితో పోలిస్తే  ఈ ఏడాది కార్ల అమ్మకాలు 9 శాతం పడిపోయాయని రీసెర్చ్ సంస్థ  నువామా ఈక్విటీస్ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఈ నెల 11–23 మధ్య  ప్యాసింజర్ కార్ల రిజిస్ట్రేషన్లు  2.43 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.  టూ-వీలర్ల రిజిస్ట్రేషన్లు 13శాతం, కమర్షియల్ వాహనాలు 21శాతం వృద్ధి నమోదు చేసినప్పటికీ, ఈ ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే వేగం తగ్గింది. 

నవరాత్రి టైమ్‌‌లో  కార్ల విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) మాత్రమే 9శాతం వృద్ధితో తన  మార్కెట్ వాటాను 12.6శాతానికి పెంచుకుని జోరు చూపింది. మారుతీ సుజుకి (11శాతం), హ్యుందాయ్ (11శాతం), టాటా మోటార్స్ (15శాతం) విక్రయాల్లో క్షీణత నమోదైంది. టూ-వీలర్లలో టీవీఎస్ మోటార్ (21శాతం), హోండా (18శాతం) వృద్ధి సాధించగా.. హీరో మోటోకార్ప్, బజాజ్ అమ్మకాలు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం, డెలివరీకి ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండటమే కార్ల అమ్మకాలు పడిపోవడానికి  కారణాలని నువామా రిపోర్ట్‌‌ పేర్కొంది. అయితే ధన్‌‌తేరస్, దీపావళి నాటికి గ్రామీణ డిమాండ్ పుంజుకోవచ్చని డీలర్లు ఆశిస్తున్నారు.

హ్యుందాయ్ బేయోన్ ధర రూ.10 లక్షలు

హ్యుందాయ్ తన సరికొత్త 'బేయోన్' ఎస్‌‌యూవీని భారత్‌‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షలు.  ఈ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ గేర్‌‌బాక్స్‌‌లతో 7 వేరియంట్లలో లభిస్తుంది. డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్‌, ఏఐ వాయిస్ అసిస్టెంట్, పనోరమిక్ సన్‌‌రూఫ్, లెవల్-2 అడాస్ , 6 ఎయిర్‌‌బ్యాగ్‌‌లు దీని  ప్రత్యేకతలు.