- నేటి నుంచి కరెంట్, నీళ్ల పొదుపుపై కళాజాతలు
- బస్తీలు, కాలనీల్లో అవగాహన
- రెండు నెలల పాటు కార్యక్రమాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ‘ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక నీళ్ల సమస్య వస్తోంది. నీళ్లు లేక కరెంట్ఉత్పత్తి తగ్గి విద్యుత్‌కోతలు తీవ్రమవుతాయి..కాబట్టి అందరూ నీళ్లను, కరెంట్‌ను కాస్త చూసుకుని వాడుకోండి’ అంటూ అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ కలెక్టరేట్ సిద్ధమైంది. రాబోయే ఎనిమిది నెలలు గడ్డుకాలం అంటూ మంగళవారం నుంచి రెండు నెలల పాటు బస్తీలు, కాలనీల్లో కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పించనున్నది. దీనికి సంబంధించి రవీంద్రభారతిలో కళాజాత బృందాలకు ఒక రోజు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇందులో ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, వెటర్నరీ వంటి ప్రధాన శాఖల ఉద్యోగులు కూడా ఉన్నారు. సమీక్షలకే పరిమితం కాకుండా ఫీల్డ్‌కు వెళ్లి అవగాహన కల్పించనున్నారు.
రోజూ వాడేదాన్ని సగం చేయండి...
సిబ్బంది..అన్ని మండలాలు, మున్సిపల్ సర్కిళ్లు, బస్తీల్లో కళాజాత బృందాల ద్వారా వీధి నాటకాలు ప్రదర్శించనున్నారు. పాటలు, ప్రచార రథాలతో నీటి విలువ, విద్యుత్ పొదుపు అవసరాలను వివరించనున్నారు. గృహిణులు రోజువారీ పనుల్లో భాగంగా ఇండ్లు కడగడాన్ని తగ్గించాలని, వంటగదిలో నీటి వినియోగాన్ని సగానికి తగ్గించాలని, స్నానం, ఇతర అవసరాలకు కూడా రోజూ వాడే నీటి కంటే తక్కువగా వినియోగించాలని చెప్పనున్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ సంఘాలను భాగస్వామ్యం చేసి ఎక్కడైనా నీళ్లు లీకైతే వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నంబర్ లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు.
కరెంట్ గురించి..
అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో లంచ్ టైంలో, సమీక్షలకు బయటకు వెళ్లిన టైంలో అన్ని లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఆఫీసుల్లో పగటిపూట సహజ వెలుతురు ఉంటే లైట్లు వేయొద్దని, గదుల్లో ఎవరూ లేకపోయినా ఏసీలు, ఫ్యాన్లు ఆన్‌లైన్‌లో ఉంచడం వంటి అనవసర వృథాను అరికట్టాలన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రైవేటు యాజమాన్యాలు, వాణిజ్య సంస్థలకు కూడా వర్తింపజేయనున్నారు. పగటిపూట స్ట్రీట్ లైట్లు వెలగకుండా, భారీ పరిశ్రమలు, ఐటీ పార్కులు షాపింగ్ మాల్స్ యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి, పీక్ అవర్స్‌లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా చూడనున్నారు. ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్ వాడకంపై అవేర్‌నెస్ కల్పించనున్నారు.
వెటర్నరీ, మూగజీవాల రక్షణ
ఎండల తీవ్రత పెరిగితే మనుషులకే కాక, పశువులు, కుక్కలు, పక్షులు, డైరీ ఫామ్‌లలోని మూగజీవాలపై ఎఫెక్ట్ పడనున్నది. డైరీ ఫామ్ యజమానులకు వేసవిలో పశువులను వడదెబ్బ నుంచి కాపాడుకునే మెలకువలు షెడ్లపై గడ్డి కప్పడం, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ వాడటంపై అవగాహన కల్పించనున్నారు.
