- విప్ బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు: పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ టూర్ల పేరుతో కేటీఆర్ చేసిన బాగోతాలన్నీ బయటపెడ్తానని విప్ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కే రామ్, రామ్ కేటీ పేర్లతో ప్రైవేట్ జెట్లలో కేటీఆర్ తరుచూ మహిళలతో దుబాయ్ వెళ్లిన విషయం తమకు తెలుసన్నారు.
శంషాబాద్ నుంచి నేరుగా దుబాయ్ కి వెళ్లకుండా వయా బెంగుళూరు, ఢిల్లీ మీదుగా దుబాయ్ వెళ్లిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఆయన వెంట విదేశాలకు వెళ్లిన ఆ నలుగురు మహిళలు ఎవరనేది కేటీఆర్ చెప్పాలని, లేదంటే తానే ఆ రహస్యాన్ని బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను చేస్తున్న ఈ ఆరోపణలు అవాస్తవమని చెప్పే ధైర్యం కేటీఆర్ కు లేదన్నారు. ఎందుకంటే అవన్నీ నిజాలని, కాదంటే ఆధారాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తనను ఆ పార్టీలోకి ఆహ్వానించారని, అందుకు తాను తిరస్కరించినందుననే తనపై రాజకీయంగా కక్ష కట్టారని వెంకట్ఆరోపించారు. కేటీఆర్ అసలు పేరు అజయ్ అని, కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్ తన కొడుకు పేరును కేటీఆర్ గా మార్చారని చెప్పారు.
