వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి నీళ్లిస్తాం..కాలువల కోసం రైతులు సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి నీళ్లిస్తాం..కాలువల కోసం  రైతులు సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ/ హుస్నాబాద్, వెలుగు: వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాలువల కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. 

వచ్చే సీజన్ లో సాగునీటికి, కరెంట్​కు ఇబ్బంది ఉంటుందని, కాబట్టి రైతులు వరి వేయవద్దని సూచించారు. దళారులు అడ్వాన్స్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేస్తే డబ్బులు ఎగ్గొట్టే అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుని దళారుల చేతిలో మోసపోవద్దన్నారు. ప్రస్తుత సీజన్‌‌‌‌‌‌‌‌లో వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ధాన్యానికి డిమాండ్ పెరిగిందని, వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల వద్దకే వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు. 

అయితే ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తేనే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలన్నారు. నియోజకవర్గంలో 136 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేట మండలం ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రథమ స్థానంలో ఉందని, అన్ని గ్రామాల్లో మేజిక్ పిట్స్, ఫామ్ పాండ్స్, ఊటకుంటలు నిర్మించుకోవాలన్నారు. 

రెండేండ్ల వరకు ప్రజల అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని, తాగునీటికి మాత్రం ఇబ్బంది ఉందన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 18వ చండీయాగం నిర్వహించినట్లు తెలిపారు. కొండగట్టు, వేములవాడ, కొత్తకొండ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించారు. 

రేపు అఖిలపక్ష భేటీ.. కేంద్ర సహకారం కోరతాం

ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం రాష్ట్రానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాలని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 28న రాష్ట్రస్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. అనంతరం అఖిలపక్ష బృందంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరతామని వెల్లడించారు. 

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లోనూ స్థానిక రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ దండి లక్ష్మి, కోహెడ ఏఎంసీ చైర్ పర్సన్ నిర్మల, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, సుధాకర్, ఆర్డీవో రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.