ప్రయాణ బీమా పొందాలంటే.. రైల్వే కౌంటర్ వద్దే టికెట్లకు ఇన్సూరెన్స్ 

ప్రయాణ బీమా పొందాలంటే.. రైల్వే కౌంటర్ వద్దే టికెట్లకు ఇన్సూరెన్స్ 
  • డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి

న్యూఢిల్లీ: రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు ఆప్షనల్​ ప్రయాణ బీమాను పొందాలంటే, అక్టోబర్ 27 నుంచి 45 పైసల ప్రీమియంతో సహా మొత్తం మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలోనే చెల్లించాలని రైల్వే బోర్డు స్పష్టంచేసింది. పైసల నాణేలు చలామణిలో లేకపోవడంతో, నగదు రూపంలో ప్రీమియం వసూలు చేయలేమని అధికారులు తెలిపారు. ఆన్‌‌లైన్  బుకింగ్​కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు కౌంటర్లకూ విస్తరించారు.

ఈమేరకు సీఆర్ఐఎస్ సంస్థ అవసరమైన సాఫ్ట్‌‌వేర్ మార్పులు చేపట్టింది. ఈ బీమా కేవలం కన్ఫర్మ్, ఆర్ఏసీ, పాక్షికంగా కన్ఫర్మ్​డ్​ టికెట్లకే వర్తిస్తుంది. జర్నీ టైంలో మరణం, శాశ్వత అంగవైకల్యానికి రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు, మృతదేహం తరలింపునకు రూ. 10 వేల బీమా లభిస్తుంది.