- దేశవ్యాప్తంగా 220, తెలంగాణలో 20 ఫిర్యాదులు
- వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : అమ్మాయిల వలపు సేవల పేరుతో నకిలీ వెబ్సైట్ లింకులు పంపుతూ దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
బేల పీఎస్ పరిధిలోని సాంగిడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి ‘రాయల్ స్కార్ట్ డాట్‌కామ్’ అనే లింక్ వచ్చింది. దానిని ఓపెన్ చేయగా ఫోన్ పే ద్వారా రూ.2,200 చెల్లించాలని మెసేజ్ వచ్చింది. అది నిజమైన లింక్ అని నమ్మిన బాధితుడు డబ్బులు చెల్లించాడు.
అనంతరం అతడి అనుమతి లేకుండానే క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఖాతాల నుంచి 16 లావాదేవీల ద్వారా మొత్తం రూ.4,20,210 డెబిట్ అయ్యాయి. దీంతో బాధితుడు బేల పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు రూ.2 లక్షలు తిరిగి రాబట్టారు. సాంకేతిక ఆధారాలు, మొబైల్ నెంబర్లు, ఆన్లైన్వాదేవీల వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన దినేష్ పటేల్ ని నిందితుడిగా గుర్తించి, గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై దేశవ్యాప్తంగా 220 ఫిర్యాదులు నమోదు కాగా, తెలంగాణలో 20 ఫిర్యాదులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడు ఇతరుల గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డులు సేకరించి, నకిలీ కాల్‌గర్ల్, వలపు సేవల వెబ్సైట్లింకులను ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసేవాడని తెలిపారు. ఆ లింకులను నమ్మి సంప్రదించిన బాధితులతో టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా మాట్లాడి, వివిధ రకాల సేవలు అందిస్తామని నమ్మించేవాడు.
అనంతరం బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి, మ్యూల్ ఖాతాలు, క్రెడిట్‌కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేవాడని వివరించారు. నిందితుడి నుంచి మూడు మొబైల్స్, మినీ ఐప్యాడ్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, జైనత్సీఐ జి.శ్రావణ్‌కుమార్, బేల ఎస్సై మధుకృష్ణ, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
