- జన సమీకరణ కోసం కసరత్తు
- అబ్జర్వర్‌గా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే
- రవాణా, భోజన వసతుల కోసం ఐదుగురితో కమిటీ
- పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: ఓటర్ జాబితా (సర్) అక్రమాలకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన భారీ సభకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో జన సమీకరణ కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండేను రాష్ట్రానికి పరిశీలకుడిగా నియమించారు.
సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన, గాంధీభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కనీసం 10 వేల నుంచి 15 వేలకు తగ్గకుండా కార్యకర్తలను ఢిల్లీకి తరలించడమే లక్ష్యంగా పీసీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పార్టీకి చెందిన సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లే సుమారు 15 వేల మంది వరకు ఉన్నారని, వారంతా హాజరైనా ఈ సంఖ్యను దాటడం పెద్ద సమస్య కాదని నేతలు భావిస్తున్నారు.
ఐదుగురితో కమిటీ..
పార్టీ క్యాడర్‌ను ఢిల్లీకి తరలించేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లు, విమానాల వంటి రవాణా ఏర్పాట్లతోపాటు, ఢిల్లీలో వారికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చర్యలు చేపట్టారు. అందుకోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించారు.
ఈ కమిటీలో ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముగ్గురు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ సభ్యులుగా ఉన్నారు. వీరు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లే నాయకులు, కార్యకర్తలకు రవాణా, భోజనం, వసతి ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ నుంచే పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించి తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఉన్నారు. ఈ సభపై ఈనెల 23న ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది.
