- సివిల్ సప్లయీస్ ఆఫీసర్ల అక్రమాస్తుల వివరాలు వెల్లడిస్తాం
- బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
బషీర్‌బాగ్, వెలుగు : సివిల్ సప్లయీస్ శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల అక్రమాస్తులను జప్తు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్లపై దాడులు, కేసుల నమోదును స్వాగతిస్తున్నామని, అయితే, అధికారుల అండదండలు లేకుండా మిల్లర్లు అవినీతికి ఎలా పాల్పడతారని ప్రశ్నించారు. వనపర్తి జిల్లాలో అనుమతులు లేవంటూ రెండు రైస్ మిల్లులను కూల్చివేసిన అధికారులు, వాటికి ధాన్యం కేటాయింపులు ఎలా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సివిల్ సప్లయీస్శాఖలోని డీఎంలు, డీఎస్‌వోలు ఒక్కో సీజన్‌లో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆరోపించారు. మిల్లర్లతోపాటు అవినీతి అధికారులపైనా ఏసీబీ, సీఐడీ సోదాలు నిర్వహించాలని కోరారు. అధికారుల అక్రమాస్తులు, బినామీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వీ.వీ. గౌడ్, దేవర శివ, సిద్ధార్థ్, శ్రీకృష్ణ పాల్గొన్నారు.
