నేపాల్ లో మారువేషాల్లో నిఘా..  సర్వెంట్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌..ఈ ఏడాది మే 7న రిటైర్డ్ ఐపీఎస్ రే వినయ్ రంజన్ భార్య హత్య 

నేపాల్ లో మారువేషాల్లో నిఘా..  సర్వెంట్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌..ఈ ఏడాది మే 7న రిటైర్డ్ ఐపీఎస్ రే వినయ్ రంజన్ భార్య హత్య 
  • ఐదున్నర నెలలు సిటీ సిట్‌‌‌‌ ఇంటర్నేషనల్ ఆపరేషన్‌‌‌‌
  • ప్రధాన నిందితురాలు కల్పన సహా నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ రే వినయ్‌‌‌‌ రంజన్‌‌‌‌ భార్య తనూజా రంజన్‌‌‌‌ హత్య, బంగారు ఆభరణాల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు సభ్యుల నేపాలీ సర్వెంట్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌లో ప్రధాన నిందితురాలు ధర్మ తిరువా అలియాస్‌‌‌‌ కల్పన (26) సహా నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేశారు. పరారీలో ఉన్నమరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఏడాది మే 7న జూబ్లీహిల్స్‌‌‌‌ ప్రశాసన్‌‌‌‌నగర్‌‌‌‌లో తనూజా హత్యకు గురయ్యారు. కేసు దర్యా ప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌‌‌ (సిట్‌‌‌‌) ఐదున్నర నెలల పాటు ముంబై, పుణే, పట్నా, యూపీ, ఉత్తరాఖండ్‌‌‌‌తో పాటు నేపాల్‌‌‌‌లోనూ ఆపరేషన్‌‌‌‌ నిర్వహించింది. దేశవ్యాప్తంగా వరుస దోపిడీలకు పాల్పడుతున్న నేపాలీ సర్వెంట్ గ్యాంగుల వివరాలను సీపీ సజ్జనార్‌‌‌‌ సోమవారం వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌‌‌‌ దోపిడీకి పుణేలో స్కెచ్

జూబ్లీహిల్స్‌‌‌‌ ప్రశాసన్‌‌‌‌ నగర్‌‌‌‌లో రిటైర్డ్‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌ అధికారి రే వినయ్‌‌‌‌ రంజన్‌‌‌‌ ఇంట్లో గతేడాది జూన్‌‌‌‌లో నేపాల్‌‌‌‌కు చెందిన కల్పన పనిమనిషిగా చేరింది. నెలకు రూ.20 వేల వేతనంతో పనిచేస్తూ ఇంటి పరిసరాలు, కుటుంబ పరిస్థితులపై నిఘా పెట్టింది. పుణేకు చెందిన బికాస్‌‌‌‌ తో  కలిసి  దోపిడీకి ప్లాన్‌‌‌‌ చేసింది. ఈ క్రమంలో మే 4న యజమాని బెంగళూరుకు వెళ్లిన విషయాన్ని బికాస్‌‌‌‌కు తెలియజేసింది.

కల్పన ఇచ్చిన సమాచారంతో ముంబై, బెంగళూరులో నివాసం ఉండే నేపాలీలు గణేష్‌‌‌‌ షాహి, శంకర్ లామ, సునీల్ పరియార్‌‌‌‌‌‌‌‌, గణేష్‌‌‌‌ బికె, దిలీప్ బిశ్వకర్మ, నెత్ర షాహీలు మే 5న పుణేలో మీటింగ్‌‌‌‌ నిర్వహించుకున్నారు.25 మందికి పైగా టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు టీమ్స్‌‌‌‌గా ఏర్పడి కల్పన సహా మిగితా నిందితుల కోసం బెంగళూరు, ముంబై, పుణే, సూరత్‌‌‌‌, పాట్నా, ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో గాలించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌, ఉత్తరాఖండ్‌‌‌‌, ముంబై పోలీసులతో కలిసి భారత్‌‌‌‌–నేపాల్‌‌‌‌ సరిహద్దుల్లో మకాం వేసి, కొండ ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరిపారు.

టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు మారువేషాల్లో తిరుగుతూ స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే మే 22న అనుమానితుడు సునీల్‌‌‌‌ బహదూర్‌‌‌‌ ఔజీ అలియాస్‌‌‌‌ సునీల్‌‌‌‌ పరివార్‌‌‌‌తో పాటు దొంగసొత్తు కొనుగోలు చేసిన దిలీప్‌‌‌‌ బహదూర్‌‌‌‌ మిజార్‌‌‌‌ అలియాస్‌‌‌‌ సోనార్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారు. వీరి వద్ద 26 గ్రాముల చోరీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్పన కుమారుడి ఫోన్‌‌‌‌ నంబర్ల ఆధారంగా ఆమె ఆచూకీ కనిపెట్టారు. బెంగళూరు, గురుగ్రామ్‌‌‌‌లో మరో దోపిడీకి స్కెచ్​చేస్తున్నట్లు గుర్తించారు. నేపాల్‌‌‌‌లో కల్పనతో పాటు గణేష్‌‌‌‌ బీకే, చంద్ర బహదూర్‌‌‌‌ తమాంగ్‌‌‌‌, గణేష్‌‌‌‌ బహదూర్‌‌‌‌ షాహీలను అరెస్ట్‌‌‌‌ చేశారు. 

సిట్ సెర్చ్ ఆపరేషన్‌‌‌‌లో పాతనేరస్తులు పట్టివేత

సిట్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌లో అరెస్టయిన చంద్ర బహదూర్‌‌‌‌ తమాంగ్‌‌‌‌ అలియాస్‌‌‌‌ రంజీత్‌‌‌‌ థాపాపై ఢిల్లీలో, గణేశ్‌‌‌‌ బహదూర్‌‌‌‌ షాహీపై కర్ణాటకలో గతంలో కేసులు నమోదయ్యాయని సీపీ సజ్జనార్‌‌‌‌ వెల్లడించారు. ఇదే ఆపరేషన్‌‌‌‌లో దీర్ఘకాలంగా పరారీలో ఉన్న నేపాల్‌‌‌‌ నేరస్తుడు జీవన్‌‌‌‌ చంద్‌‌‌‌ అలియాస్‌‌‌‌ జిబాన్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేశారు. తెలంగాణతో పాటు బెంగళూరు, గుజరాత్‌‌‌‌, మహారాష్ట్రల్లో నమోదైన 8 నేరాలతో అతడికి సంబంధం ఉందన్నారు. అలాగే, పరారీలో ఉన్న నిందితులపై ఐదు నాన్‌‌‌‌బెయిలబుల్‌‌‌‌ వారెంట్లను కూడా సిట్‌‌‌‌ ఎగ్జిక్యూట్‌‌‌‌ చేసినట్లు పేర్కొన్నారు. నేపాలీలు నకిలీ ఆధార్‌‌‌‌ కార్డులతో ఇండ్లలో పనివారిగా చేరే ప్రమాదం ఉందని, సర్వెంట్లను నియమించుకునే ముందు వారి వివరాలను నేపాల్‌‌‌‌ సిటిజన్‌‌‌‌ పోర్టల్‌‌‌‌లో తనిఖీ చేసుకోవాలని సీపీ సూచించారు.

మే 7న అర్ధరాత్రి హత్య, బంగారంతో పరారీ 

పుణే నుంచి హైదరాబాద్‌‌‌‌ చేరుకున్న ఆరుగురు సభ్యుల ముఠా జూబ్లీహిల్స్‌‌‌‌లోని రే వినయ్‌‌‌‌ రంజన్‌‌‌‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది. ముందస్తు ప్లాన్​ప్రకారం మే 7న రాత్రి గ్యాంగ్ సభ్యులు రెండు బృందాలుగా విడిపోయారు. ఒక టీమ్‌‌‌‌ ఇంట్లోకి ప్రవేశించి దోపిడీ చేయగా, మరొక టీం బయట నిఘా పెట్టింది. అయితే దోపిడీ సమయంలో రిటైర్డ్‌‌‌‌ ఐపీఎస్ భార్య తనుజా రంజన్‌‌‌‌ మేల్కొనడంతో.. బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లో ఆమె చేతులు కట్టేసి నోటిలో గుడ్డ కుక్కి హత్య చేశారు.

అనంతరం 225 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో పరారయ్యారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌ కు చేరుకొని, అక్కడి నుంచి వరంగల్‌‌‌‌, ఖాజీపేట వైపు వెళ్లారు. దోచుకున్న సొత్తును తొమ్మిది వాటాలుగా పంచుకున్నారు. అంతా విడిపోయి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకుంటూ నేపాల్‌‌‌‌ పారిపోయారు. మే 8న బాధితురాలి కుమార్తె  జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనిమనిషి కల్పన అదృశ్యం కావడంతో పోలీసులు ఆమె కోసం గాలించారు.