తొగుట, వెలుగు: మక్కలు పండించిన రైతులకు ఈ సీజన్లో మంచి రేటు వస్తోంది. ఎన్నడూ లేనివిధంగా మార్కెట్ లో రికార్డు ధర పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,410 కాగా, ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, తొగుట, రాయపోల్, మిరుదొడ్డి మండలాల్లో క్వింటాలుకు రూ.2,800 నుంచి రూ.2,900 వరకు అమ్ముడుపోతోంది. ఎంఎస్పీ కంటే ఏకంగా రూ.400 నుంచి 500 వరకు అదనంగా లభిస్తోంది.
కల్లాల దగ్గరకే దళారులు..
వ్యాపారులు, దళారులే నేరుగా కల్లాల దగ్గరకే లారీలు, ట్రాక్టర్లతో వచ్చి కొనుగోలు చేస్తుండడంతో రైతులు మార్కెట్ కు వెళ్లాల్సిన అవసరం తప్పింది. గతంలో మాదిరిగా యార్డుల చుట్టూ తిరగడం, తరుగు పేరుతో కోత, హమాలీ, లారీ ఛార్జీలు, మార్కెట్ లో పడిగాపులు తప్పాయి. రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలం ఘనపూర్ తదితర గ్రామాల్లో పంటను కల్లాల్లోనే తూకం వేసి, నగదు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ, కంపెనీల నుంచి మక్కలకు విపరీతమైన డిమాండ్ పెరగడం, అదే సమయంలో ఎల్ నినో ప్రభావంతో యాసంగి పంటలు రాకపోవచ్చన్న ప్రచారం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రైతుల సంతోషం..
గత వానాకాలం సీజన్ కంటే ఈసారి రూ.400 నుంచి రూ.500 అదనంగా ధర పలకడంతో రైతులు సంతోషపడుతున్నారు. ‘ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రూ.70 వేల వరకు ఆదాయం వస్తోంది. కల్లం వద్దకే వచ్చి కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది" అని తొగుట మండలం ఘనపూర్ రైతు కుంబాల మధు అన్నారు. మక్కల రేటు క్వింటాలుకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు పెరగవచ్చని రైతులు ఆశిస్తున్నారు.
