- హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికీ గత పాలకుల గతే
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.42 వేలు చెల్లించాలని సీఐటీయూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడింది. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో చేపట్టిన 2 రోజుల మహాధర్నా ముగిసింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మాట్లాడుతూ.. హైదరాబాద్ వేదికగా కార్మికులు వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని పాలకులు గుర్తించాలన్నారు.
కార్మిక చట్టాలను కాలరాస్తున్న యాజమాన్యాలకు ఈ ధర్నా చెంపపెట్టు లాంటిదన్నారు. గడిచిన ఆరేళ్లుగా లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని కోట్లాది మంది సమ్మె చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేబర్ కోడ్స్‌ను తిరస్కరించకుండా కేంద్రంలోని బీజేపీకి వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాల వైఖరి మారకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న 29 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల పట్ల కాంగ్రెస్ తీరు మారకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారుతున్నా స్కీం వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, పారిశుద్ధ్య, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల జీవితాలు మారడం లేదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మల్లు లక్ష్మి అన్నారు.
