గతంలో 1.10 లక్షల ఓటర్లు..ఈసారి 23వేల దరఖాస్తులేనా? : ఎమ్మెల్యే తలసాని

గతంలో 1.10 లక్షల ఓటర్లు..ఈసారి 23వేల దరఖాస్తులేనా? :  ఎమ్మెల్యే తలసాని

పద్మారావునగర్​, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు విషయంలో అటు ఎన్నికల కమిషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని సనత్​నగర్​ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం వెస్ట్ మారేడ్‌‌పల్లి క్యాంపు ఆఫీసులో సనత్‌‌నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. నవంబర్ 6తో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు ముగుస్తున్నా.. ఎన్నికల సంఘం కనీసం బీఎల్‌‌వోలను కూడా నియమించలేదన్నారు. 

అందుకే, తాము  బాధ్యత తీసుకుని నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నగర పరిధిలోనే 1.10 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా, ఈసారి ఇప్పటివరకు కేవలం 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ఇది ఎన్నికల కమిషన్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తాము అప్లికేషన్లు తీసుకుని ఇస్తుంటే అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.