న్యూఢిల్లీ: దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్న ఈక్విటీ షేర్లపై లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ ) ట్యాక్స్‌ను కేంద్రం మార్చే అవకాశం ఉంది. ఈ విధానాన్ని మళ్లీ సమీక్షిస్తామని ప్రభుత్వ వర్గాలు తాజాగా ప్రకటించాయి.వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ముందే దీనిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిపాయి. ప్రస్తుతం లిస్టెడ్ ఈక్విటీలపై ఏడాదికి రూ.1.25 లక్షలకు మించిన లాభాలపై ఎలాంటి ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5శాతం ఎల్‌టీసీజీ విధిస్తున్నారు. ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణం అడ్జెస్ట్ చేశాక మిగిలిన లాభాలపై ట్యాక్స్ వేయడం. ఎల్‌టీసీజీపై ఈ ప్రయోజనం లేదు.
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) స్టాక్ మార్కెట్ నుంచి భారీగా నిధులను విత్‌డ్రా చేసుకుంటుండడంతో ప్రభుత్వం ఎల్‌టీసీజీ ట్యాక్స్ విధానాన్ని మళ్లీ సమీక్షించాలని నిర్ణయించింది. 2026లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు భారత మార్కెట్ల నుంచి నికరంగా రూ.3.1 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఇది గతేడాది మొత్తం జరిగిన విత్‌డ్రాల విలువ రూ.1.7 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ. అమెరికా, యూకే, సింగపూర్, హాంకాంగ్, యూఏఈ వంటి దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ లాభాలపై సున్నా పన్ను రేటు ఉంది. దీంతో భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. కాగా, ఎల్‌టీసీజీ తొలగిస్తే ఎఫ్‌ఐఐల అమ్మకాలు మరింత పెరుగుతాయని కొంతమంది ఎనలిస్టులు చెబుతున్నారు.
డాలర్లలో లాభాల లెక్క!
మరోవైపు విదేశీ ఇన్వెస్టర్ల లాభాలను రూపాయి విలువలో కాకుండా, 'డాలర్ మారకం' ఆధారంగా లెక్కించాలనే ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. రూపాయి క్షీణత వల్ల డాలర్లలో వాస్తవ రాబడులు తగ్గుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఎల్‌టీసీజీ అంశంపై సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
