హైదరాబాద్ ,వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) సర్వర్ల లోపం కారణంగానే తాత్కాలిక సాంకేతిక సమస్య ఎదురైందని, ప్రస్తుతం దానిని పరిష్కరించామని ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ విజయేంద్ర బోయి తెలిపారు. అప్లికేషన్ సబ్మిట్ టైమ్లో ఆధార్, ఎస్ఎస్సీ మెమోలో వివరాల మధ్య తేడాకు ఇదే కారణమని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తిప్పలు’ శీర్షికతో వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
దరఖాస్తు సమయంలో ఆధార్, ఎస్ఎస్సీ మెమోలలోని వివరాలు ఒకేలా ఉండేలా విద్యార్థులు జాగ్రత్త వహించాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వివరాల్లో తేడాలు ఉంటే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని, సవరణల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. అలాగే, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ప్రత్యేకంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని, సర్టిఫికెట్ నంబర్ నమోదు చేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల సమర్పణకు ఈనెల 28 చివరి తేదీ కాదని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు ఉందని ఆమె వెల్లడించారు.
