కెరీర్‌లో ఫస్ట్ టైమ్ కామెడీ రోల్ చేయడం హ్యాపీగా ఉందని చెప్పింది శ్రీనిధి శెట్టి. వెంకటేష్‌కు జంటగా ఆమె నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (అక్టోబర్ 30) విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను గురించి శ్రీనిధి శెట్టి ఇలా వివరించింది.
‘‘ఇందులో వెంకటేష్ గారికి వైఫ్‌గా, ఇద్దరు పిల్లలకు మదర్‌గా కనిపిస్తా. త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. ఆయన నుంచే పిలుపు రావడం హ్యాపీ. కథ వినగానే ఈ చిత్రంలో ఖచ్చితంగా భాగం కావాలి అనిపించింది తప్ప తల్లి పాత్ర కదా నో చెప్పాలనే ఆలోచన రాలేదు. అది ఎందుకనేది సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. ఇది త్రివిక్రమ్ గారి గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే కొత్త జానర్ సినిమా.
ఆయన ఇటీవల ఓ ఈవెంట్‌లో చెప్పినట్టు ఇది క్రైమ్ కామెడీ, డార్క్ కామెడీ కలగలిసిన చిత్రం. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ కామెడీ రోల్ చేశా. చిట్‌ఫండ్‌లో డబ్బులు పోగొట్టుకుని, అప్పులు చేసే వైఫ్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్స్, సినిమాలు అరుదుగా వస్తాయి. మొదట్లో ఎలా చేస్తానో అనే సందేహం వచ్చినా, అవుట్‌పుట్ చూశాక ఎంతో సంతృప్తి కలిగింది. వెంకటేష్ గారి కామెడీ టైమింగ్, యాక్టింగ్‌ను మ్యాచ్ చేయడం అనేది ఈజీ కాదు. కానీ నా వంతు ప్రయత్నం చేశా. త్రివిక్రమ్ గారి హెల్ప్‌తో కామెడీ సీన్స్‌లో ఆర్గానిక్‌గా నటించడానికి ట్రై చేశా. వాళ్లిద్దరి కాంబోలో వచ్చే కామెడీ నేచురల్‌గా ఉంటుంది. అందులో నేను ఇమిడిపోయే ప్రయత్నం చేశా.
సినిమాలోని కామెడీని ఎంతగా ఎంజాయ్ చేస్తారో, యాక్షన్‌ను అంతే ఎంజాయ్ చేస్తారు. ఓ దర్శకుడిగా త్రివిక్రమ్ గారు తెలుసు.. వ్యక్తిగా ఆయన ఏమిటనేది సెట్‌లో కలిశాకే అర్థమైంది. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎందుకలా వింటూ ఉండిపోతారో తెలిసింది. నటీనటులకు ఆయన చాలా కంఫర్ట్ ఇస్తారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఏడాదికి పైగా సాగిన ఈ ప్రయాణం ఎంతో బాగుంది. కంటెంట్ పరంగా నాకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నా. పైగా నేను చేసినవి పెద్ద సినిమాలు కావడంతో ఏడాది రెండేళ్లు సమయం తీసుకుంటున్నాయి. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నా అనిపిస్తోంది. ప్రస్తుతం కన్నడలో ఒక సినిమా చేస్తున్నా. తెలుగులో కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’’.
