వెలుగు స్పెషల్ : జల్,జంగల్,జమీన్ నినాద ధీరుడు కొమరం భీం  

వెలుగు స్పెషల్ : జల్,జంగల్,జమీన్ నినాద ధీరుడు కొమరం భీం  

సామాన్యమైన జీవితం గడుపుతూ స్వాభిమానం, ఆత్మగౌరవంతో  జీవించే  గిరిజనులు విదేశీ ఆక్రమణదారులను భారతదేశంలోకి అడుగు పెట్టకుండా తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఎన్నో యుద్ధాలు చేశారు.  నాడు భారతదేశాన్ని  బ్రిటిష్‌‌‌‌వారు పాలిస్తుంటే తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబు పాలించేవారు.   నిజాం, ఆయన తాబేదారులు, పట్వారీలు, ప్రభుత్వ అధికారులు భూమి శిస్తు పేరుతో గిరిజనులు పండించిన పంటలను బలవంతంగా లాక్కునిపోయేవారు.  ఒక్కొక్కసారి గూడాలను మొత్తంగా తగులబెట్టి మాన, ప్రాణాలను హరించేవారు. నిజాం నిరంకుశ పాలనను సవాల్ చేసిన గోండు వీరుడు కొమరం భీం.  తమ  జన్మహక్కు అయిన జల్,- జంగల్,- జమీన్ తమకు కావాలంటూ అడవి బిడ్డల కోసం  కొదమసింహంలా  నైజాం నవాబ్ అసఫ్ అలీఖాన్,  ఆంగ్లేయులతో పోరాడాడు. 

గిరిజనులపై నిజాం అరాచకం

22 అక్టోబర్ 1901 చిన్నూ,  సోంబాయిలకు  ఆసిఫాబాద్  సమీపంలోని  సంకేపల్లి  గ్రామంలో భీం జన్మించాడు. తండ్రి మరణానంతరం చిన్నాన్నలు కుర్దూ, ఇస్తూలతో  కలిసి కెరమెరీ మండలం సర్దాపూర్‌‌‌‌‌‌‌‌కు వలస వెళ్లారు. అడవితల్లిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న తరుణంలో ప్రభుత్వం భూచట్టం తీసుకొచ్చి గిరిజనులు దున్నుకొని నివసిస్తున్న భూమిని గిరిజనులకు చెందకుండా లాక్కొన్నది. 1917లో  నైజాం ప్రభుత్వం తెచ్చిన అటవీ చట్టం  అనేక పరిమితులు,  పన్నులు విధించింది.  పశువులను మేపుకుంటే  బంచరాయి,  కలప  తెచ్చుకుంటే దుంప పట్టి, ఘర్ పట్టి,  నాగర్​ పట్టి  ఫసల్ పట్టి చౌబినావంటి అనేక రకాల పన్నులను విధించారు.  అటవీ అధికారుల ముసుగులో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వంలో పట్టాలు జారీ చేసే  సిద్ధిక్ అనే అధికారి గోండు గిరిజనుల భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు.  గోండు గిరిజనులను పఠాన్లతో కొట్టించాడు. అప్పుడు దానిని చూసి తట్టుకోలేక కొమరం భీం సిద్ధిక్‌‌‌‌పై దాడి చేశాడు.  నిజాం సైనికులు భీంపై నేరం మోపి పట్టుకునే ప్రయత్నం చేయగా.. భీం మహారాష్ట్రలోని బల్లార్షాకు ఆ తర్వాత చంద్రపూర్ వెళ్లి అటు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి అస్సాంకు చేరుకొని చదవడం,  ఆయుధాల శిక్షణ మొదలగునవి అక్కడి స్వాతంత్ర్య సమరయోధుల వద్ద నేర్చుకున్నాడు. 

ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీం పేరు

అల్లూరి, భగత్ సింగ్  కథలను విని యోధుడిగా తిరిగివచ్చాడు.  భీం రాకతో యువకులలో కొత్త ఉత్సాహం వచ్చింది. భీం వారందరితో కలిసి చుట్టుపక్కల అడవిని చదును చేసి వందలాది ఎకరాలను వ్యవసాయ భూమిగా మార్చాడు. బాబేఝరి, కెరమెరి మండల సర్దాపూర్ పరిసరాలలో రెండు కొండల మధ్య జోడేఘాట్ ఏరియాలో 12 గ్రామాలు రూపాంతరం చేశారు. 300 మంది గిరిజనులకు గెరిల్లా పోరాటాలు, యుద్ధవిద్యలు నేర్పించాడు. ఆ ప్రాంత  ప్రజలలో చైతన్యం కలిగించి ఆసిఫాబాద్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు తమ భూములకు పట్టాలు ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. స్పందన కరువవడంతో ఆశయ సాధనకు ఆయుధం పట్టక తప్పలేదు.

1936 నుంచి 1940 వరకు బ్రిటిష్,  నిజాం ప్రభుత్వాలతో  కొమరం భీం పోరాటం  చేశాడు. నిజాం ప్రభుత్వ సేనలు ఈ పోరును ఎదుర్కోలేక వెన్నుపోటు పొడవాలని భీం ఆచూకీ తెలుసుకొని ఆయనను చుట్టుముట్టి జోడేఘాట్ వద్ద నిజాం సైనికులు అలీ రజా సత్తార్ నాయకత్వంలో  కాల్పులు  ప్రారంభించారు. భీకర పోరాటం కొనసాగించి ఎంతోమంది గిరిజన వీరులు ప్రాణాలను కోల్పోయారు. భీం శరీరం తూటాలతో నరమేధానికి బలి అయినది.  తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కొమరం భీం  పోరాట పటిమను గుర్తించి ప్రభుత్వం  ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీం జిల్లా అని పేరు పెట్టింది.  కొమరం భీం వర్ధంతి  సందర్భంగా ఆ యోధుడికి  ఘనంగా నివాళి అర్పిద్దాం.

 - శర్మన్ నాయక్ 
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.