- 27,131 బడులకు 72.87 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కేటాయిస్తున్నామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్ల స్లాబులను నిర్ణయించే అధికారం కేంద్రానికే ఉందని తెలిపారు. ఈ నెల 22న ‘వెలుగు’లో ప్రచురితమైన ‘పెద్ద బడులకు.. గ్రాంట్ల గండం’ కథనంపై ఆయన వివరణ ఇచ్చారు.
2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 27,131 పాఠశాలలకు కేంద్ర ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు రూ.72.87 కోట్లను ఆమోదించిందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టులో 26,332 స్కూళ్ల ఖాతాలకు రూ.67.95 కోట్లను బదిలీ చేసినట్లు వివరించారు. కాంపోజిట్ గ్రాంట్‌లో కనీసం 10 శాతం నిధులను స్వచ్ఛతా యాక్షన్ ప్లాన్‌కు వినియోగించాలనే నిబంధన ఉందన్నారు.
రిజిస్టర్లు, పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగలు, కంప్యూటర్లు, డిజిటల్ తరగతుల పరికరాల మరమ్మతులు, తాగునీరు, చిన్నపాటి మరమ్మతులకు ఈ నిధులు వినియోగిస్తారని తెలిపారు. పాఠశాలల నిర్వహణకు కాంపోజిట్ గ్రాంట్‌తోపాటు ఇతర నిధులూ అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోందని, టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు.
