- రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అనుమతి
- అంగుల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని నైనీ బొగ్గు గనుల నుంచి రైల్వే సైడింగ్ వరకు బొగ్గు రవాణా సమయం పొడిగింపుకు అంగుల్ జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్డు మార్గాన బొగ్గు రవాణా చేయడానికి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నైనీ గని నుంచి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) తో పాటు తెలంగాణ జెన్కో ప్లాంట్లకు బొగ్గు రవాణా జరుగుతోంది.
అయితే, స్థానిక యంత్రాంగం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు (4 గంటలు) మాత్రమే అనుమతించడంతో అనుకున్న స్థాయిలో బొగ్గును తరలించడం సాధ్యపడలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీజీ జెన్కో సీఎండీ హరీశ్, కోల్ డైరెక్టర్ బి. నాగ్య సోమవారం అంగుల్ జిల్లా కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిశారు. తెలంగాణ విద్యుత్ కేంద్రాల అవసరాలను వివరించి రవాణా సమయం పొడిగించాలని కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమయాలను సడలించి రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు, రోడ్డు మార్గంలో బొగ్గును రవాణా చేసేందుకు అంగీకరించారు. దీనివల్ల నైనీ గని నుంచి బొగ్గు రవాణా మెరుగుపడి జెన్కో బొగ్గు సరఫరా లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
