- తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లే లేవు..
- అందుకే కాళేశ్వరం కట్టినం
- దేవాదుల, కల్వకుర్తి నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్
- నా సవాల్‌కు మంత్రి ఉత్తమ్ రెడీనా?: హరీశ్ రావు
హైదరాబాద్,వెలుగు: తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని, ఎలా వస్తాయో చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఒక్క చుక్క నీళ్లయినా తెస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, తీసుకురాలేకపోతే ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. సీఎంవో అంత బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు ఎలా విడుదల చేస్తుందని నిలదీశారు. దమ్ముంటే ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టి తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు తెస్తామని చెబుతున్నారని, పనులు పూర్తయ్యేసరికి ఆ అంచనాలు రూ.40 వేల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని, అక్కడ కొత్తగా ఒక్క ఎకరం ఆయకట్టు కూడా రాదన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2007లో ప్రారంభమైన తమ్మిడిహట్టి ప్రాజెక్టును 2014 వరకు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేకపోయిందని నిలదీశారు. కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో మూడు చోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా 152 మీటర్ల ఎత్తుకు ఎందుకు ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు.
తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు
తుమ్మిడిహెట్టి వద్ద తెలంగాణ అవసరాలకు సరిపడా నీళ్లు లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మూడుసార్లు స్పష్టంగా లేఖలు రాసిందని హరీశ్ రావు చెప్పారు. 2015 ఫిబ్రవరి 18న తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ లేఖ రాసిందని, మార్చి 4 నాటి లేఖలో ఎగువ రాష్ట్రాల వాటా పోను మిగిలే 102 టీఎంసీల్లో వాస్తవంగా డైవర్ట్ చేయగలిగేది ఎంతని ప్రశ్నిస్తూ ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించిందని తెలిపారు. మార్చి 13న నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి స్వయంగా లేఖ రాస్తూ నీటి లభ్యత లేనందున వేరే మార్గం చూసుకోవాలని తేల్చిచెప్పారన్నారు. హైదరాబాద్ తాగునీటికే 50 టీఎంసీలు అవసరమైతే, అక్కడ మిగిలే కొద్దిపాటి నీళ్లతో సాగునీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు.
ఈ లేఖల వాస్తవాల ఆధారంగానే, రీ-ఇంజనీరింగ్ చేసి 240 టీఎంసీల నీటిని వాడుకునేలా అన్ని అనుమతులతో మేడిగడ్డ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని, కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లను మూడేళ్లుగా పక్కనపెట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. కన్నెపల్లి కట్క ఒత్తితే తెలంగాణకు నీళ్ల కరువే ఉండదని స్పష్టం చేశారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో నీళ్లు ఎప్పుడు వచ్చాయి, ఎన్ని మోటార్లు నడిపారు, ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేశారనే వివరాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో లేని ‘క్రాప్ హాలిడే’ తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో సీఎం ఆలోచించాలన్నారు.
