వనపర్తి విద్యార్థులకు జాతీయ స్థాయి విద్య..కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి

వనపర్తి విద్యార్థులకు జాతీయ స్థాయి విద్య..కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి

వనపర్తి టౌన్, వెలుగు: కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో జిల్లా విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని నాగర్‌‌‌‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా నాగవరం శివారులో కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. నాలుగు నెలల కింద తరగతులు ప్రారంభమైనప్పటికీ, సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాలయ నిర్వహణకు భవనాన్ని కేటాయించిన కలెక్టర్‌‌‌‌ను ఎంపీ అభినందించారు. 

వనపర్తి జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడంలో ఎంపీ మల్లు రవి ఢిల్లీలో విశేషంగా కృషి చేశారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. త్వరలోనే విద్యాలయానికి సొంత భవనం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ సహకారంతో రూ.9 కోట్ల సీఎస్‌‌‌‌ఆర్ నిధుల ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపామని, ఇందుకోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అనంతరం వనపర్తిలోని జడ్పీహెచ్‌‌‌‌ఎస్ హరిజనవాడ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ మాధవి, డీఈవో యాదయ్య తదితరులు పాల్గొన్నారు.