సస్పెండైన అడ్వకేట్ ఉషిరెడ్డిపై చర్యలు తీసుకోండి..రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం

సస్పెండైన అడ్వకేట్  ఉషిరెడ్డిపై చర్యలు తీసుకోండి..రిజిస్ట్రీకి  హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ సస్పెండ్‌‌‌‌ చేసినప్పటికీ న్యాయవాదిగా కోర్టు ముందు హాజరవుతున్న ఉషిరెడ్డిపై పోలీసు కేసు నమోదు చేయాలని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలంటూ రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ భూముల్లో విద్యుత్తు లైన్‌‌‌‌లు వేశారన్న వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌‌‌‌లపై విచారణ సందర్భంగా ఒకరి తరఫున హాజరైన న్యాయవాది ఉషిరెడ్డి అంశం ప్రస్తావనకు వచ్చింది. 2025లో ఉషిరెడ్డిని సస్పెండ్‌‌‌‌ చేస్తూ రాష్ట్ర బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసిన విషయాన్ని ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌‌‌‌ నగేశ్‌‌‌‌ భీమపాక దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ ఆరోపణలకు సంబంధించిన అన్ని రికార్డులను, కౌంటర్లను పరిశీలించిన న్యాయమూర్తి రాష్ట్ర బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌కు గురైన వ్యక్తి దేశంలో ఏ కోర్టులోనూ న్యాయవాదిగాకానీ, వ్యక్తిగత హోదాలోగానీ కేసుల్లో వాదనలు వినిపించరాదని తేల్చి చెప్పారు. దానికి విరుద్ధంగా కేసుల విచారణకు హాజరవుతున్న ఉషిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఉత్వర్వుల కాపీని రాష్ట్ర బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌కు పంపింది.