- 10 మందికి పురస్కారాల అందజేత
హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో అక్టోబర్ నెలకుగాను విధుల్లో అసాధారణ నిబద్ధత, సమయస్ఫూర్తి కనబరుస్తూ ప్రమాదాలను నివారించిన 10మంది రైల్వే ఉద్యోగులకు “ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్’’ భద్రతా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్, వివిధ శాఖల ప్రధానాధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
వివిధ విభాగాల నుంచి అవార్డులు అందుకున్న వారిలో ముగ్గురు స్టేషన్ మాస్టర్లు, ఒక మెయిల్ లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఒక సెక్షన్ కంట్రోలర్, ఒక ట్రాక్ మెయింటెయినర్, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్‌కు చెందిన ఒక టెక్నీషియన్, ఇద్దరు పాయింట్స్మెన్లు ఉన్నారు. అవార్డు గ్రహీతలను అభినందించిన జనరల్ మేనేజర్, రైలు కార్యకలాపాలలో భద్రతను నిర్ధారించడానికి ఇతర ఉద్యోగులు కూడా మరింత అప్రమత్తంగా ఉండి చిత్తశుద్ధితో పనిచేయడానికి ఈ పురస్కారాలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
