డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు ఇయ్యలే?...హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద దరఖాస్తుదారుల మెరుపు ధర్నా

డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు ఇయ్యలే?...హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద దరఖాస్తుదారుల మెరుపు ధర్నా
  •     అడిషనల్ ​కలెక్టర్​ను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం 
  •     పున: పరిశీలిస్తామన్న ఆఫీసర్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ ​కలెక్టరేట్​ఎదుట డబుల్​బెడ్​రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని రానివారు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తాము అర్హులం అయినా కూడా..జాగా ఉందని, కారు ఉందని తప్పుడు కారణాలతో  రిజెక్ట్​ చేశారని కొందరు, ఏండ్ల కింద అప్లై చేసుకున్నా మొదటి దశలో తమకు రాలేదని మరికొందరు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. ఇటీవల బహదూర్ పురా, కార్వాన్ నియోజకవర్గాల్లో 200కు పైగా మందికి ఇండ్ల పట్టాలను ప్రభుత్వం అందజేసింది. దీంతో ఇండ్లు రానివారు సుమారు 200 మంది తమకు ఇండ్లు ఎప్పుడు ఇస్తారంటూ కలెక్టరేట్ ప్రాంగణానికి తరలివచ్చి ధర్నా చేశారు. కొంతమంది తాము ఎల్1లో( సొంత జాగా ఉన్నవాళ్లు)  ఉన్నామని, అయినా ఇవ్వలేదని వాపోయారు. ఇంకొందరు తమకు కారు లేకున్నా ఎల్ 3 కేటగిరీలో చేర్చి అనర్హులుగా ప్రకటించారని న్యాయం చేయాలని నినదించారు. ఎన్ని సార్లు ఆఫీసు చుట్టూ తిరిగినా ఎల్ 1 కేటగిరీ నుంచి మార్చడం లేదన్నారు. 

అయితే లబ్ధిదారులతో మాట్లాడటానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డు పీడీ అశోక్ చక్రవర్తిని చుట్టుముట్టి తమకు ఇండ్లు ఎప్పుడిస్తారని నిలదీశారు. అన్ని అర్హతలు ఉన్నాయని అప్లై చేసిన పేపర్లు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కింగ్ కోఠికి చెందిన యూనుస్ తనకు ప్లాట్, ఇంటి జాగా లేకున్నా.. ఎల్‌‌‌‌‌‌‌‌ 3 కేటగిరీలో చేర్చారని వాపోయాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూం కోసం అప్లై చేశానని, తాను ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నా  ఇప్పటివరకు ఇల్లు ఇవ్వడం లేదని ఇబ్రహీం అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ ఇండ్లు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వం లక్ష ఇండ్లు పేదలకు అందజేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. లబ్ధిదారులందరికీ ఇండ్లు వచ్చేలా చూస్తామని, తప్పులు జరిగినట్టు చెప్తున్న వారి దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు.