- తాబేళ్లు అంతరిస్తే సముద్ర జలాల్లో ఆక్సిజన్ లెవల్స్ కు డేంజర్
- ఉస్మానియా వర్సిటీలో సముద్ర తాబేళ్ల సంరక్షణపై సదస్సు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాతావరణ మార్పులు సముద్ర తాబేళ్ల మనుగడకు ముప్పుగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో 99 శాతం వరకు ఆడ తాబేళ్లే పుడుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మగ తాబేళ్ల సంఖ్య తగ్గితే పునరుత్పత్తి దెబ్బతిని, భవిష్యత్తులో ఈ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాబేళ్ల సంఖ్య తగ్గడం సముద్ర పర్యావరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ జువాలజీ విభాగం, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఆఫీస్, ఫౌండర్స్ లండన్ సంయుక్తంగా సోమవారం ఓయూలో ‘సముద్ర తాబేళ్ల సంరక్షణలో జన్యుశాస్త్రం, బయోఇన్ఫర్మాటిక్స్, ఏఐ’ అంశంపై మాస్టర్ క్లాస్ నిర్వహించాయి. వీసీ కుమార్ మొలుగారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆన్ రోపికెట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాబేళ్లలో గుడ్లు పొదిగే సమయంలో ఇసుక ఉష్ణోగ్రత ఆధారంగా పిల్లల లింగం నిర్ణయమవుతుందని ఆన్ రోపికెట్ వివరించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే ఆడ తాబేళ్ల సంఖ్య అధికమవుతుందన్నారు. మగ తాబేళ్లు తగ్గితే సంతానోత్పత్తి కష్టమై, క్రమంగా జాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. తాబేళ్లను గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, డ్రోన్లతో లెక్కింపు, శాటిలైట్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానాలను పరిశోధకులకు వివరించారు. గ్రీన్ సీ తాబేళ్లు సముద్రపు గడ్డిని తింటూ పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి. హాక్స్బిల్ తాబేళ్లు పగడపు దిబ్బల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తాబేళ్ల సంఖ్య తగ్గితే సముద్ర పర్యావరణ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడి, ఇతర జీవులపై ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
