- హైడ్రాపై ఎన్డీఎంఏ ప్రశంసలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: పట్టణ ప్రాంతాల్లో వరదల నివారణకు హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) ప్రశంసించింది. హైడ్రా చర్యలను దేశవ్యాప్తంగా నమూనాగా తీసుకోవచ్చని అభిప్రాయపడింది. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరద ముప్పును తగ్గించవచ్చని పేర్కొంది.
ఢిల్లీలో మంగళవారం జరగనున్న పట్టణ వరదల నిర్వహణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఎన్డీఎంఏ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగరంలో చేపట్టిన కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తొలి విడతలో ఆరు చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తిచేశామని, ఆయా ప్రాంతాల్లో వరదలు తగ్గడంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. ప్యాట్నీ, అమీర్‌పేట నాలాలతోపాటు శ్రీరాంనగర్‌లో వరద కాలువల అభివృద్ధి వివరాలను వెల్లడించారు. రెండో విడతలో 14 చెరువుల పునరుద్ధరణ, నాలుగు ప్రధాన చెరువుల అభివృద్ధి చేపడుతున్నట్లు వివరించారు.
