- కరీంనగర్ జిల్లాలో ఐదుగురు యూనిక్ కంపెనీ ఏజెంట్ల అరెస్ట్
కరీంనగర్, వెలుగు : నెలవారీ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ స్కీమ్ లు, హోటల్ వెకేషన్ ప్యాకేజీల పేరుతో ప్రజలను ఆకర్షించి కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.28 కోట్లు మోసగించిన కేసులో కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ కైలాష్ రాయ్ అనే వ్యక్తి యూనిక్ మెర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్వయం మల్టీస్టేట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ద్వారా మంత్లీ ఇన్వెస్ట్ మెంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ స్కీమ్ లతోపాటు హోటల్ వెకేషన్ ప్యాకేజీల పేరుతో ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించాడు. ఇందుకోసం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టుకున్నాడు.
కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ కు చెందిన గుడిపాటి గాంధీ, మాకలసోంపల్లి కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప, నిజామాబాద్ కు చెందిన కొమిరె భూమా గౌడ్, పెద్దపల్లికి చెందిన యేదెళ్ల రమేశ్ఏజెంట్లుగా, రీజనల్ ఇన్ చార్జీలుగా వ్యవహరించి డబ్బులు వసూలు చేశారు. వీరు ఇన్వెస్టర్లకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని నమ్మించి, బాండ్ పత్రాలు అందజేశారు. 2019లోనే వీరు ప్రవేశపెట్టిన పలు స్కీమ్ ల గడువు ముగిసినప్పటికీ పెట్టుబడిదారులకు సొమ్ము తిరిగి చెల్లించలేదు.
కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ 2020లో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో పలువురు బాధితులు కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేయగా కరీంనగర్ జిల్లాలో బాధితులకు దాదాపు రూ.26 కోట్ల నుంచి 28 కోట్ల వరకు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు లో ప్రధాన నిందితుడు అయిన రాజ్ కుమార్ కైలాష్ రాయ్ ను అదిలాబాద్ పోలీసులు గతంలో అరెస్ట్ చేయగా ప్రసుతం అదిలాబాద్ జైలులో ఉన్నాడు.
కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు సీసీఎస్ పోలీసులు గుడిపాటి గాంధీ, మాకలసోంపల్లి కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప, కొమిరె భూమా గౌడ్, యేదెళ్ల రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు లో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో లేదా కరీంనగర్ సీసీఎస్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
