‘సర్‌‌‌‌’ నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే..సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం అఫిడవిట్‌‌

‘సర్‌‌‌‌’ నిర్ణయాలన్నీ  ఏకగ్రీవమే..సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం అఫిడవిట్‌‌

 

  • ఫామ్‌‌-6లో ఎలాంటి మార్పులు చేయలేదు
  •     ఆ అధికారం కేంద్రానికే ఉంది
  •     అక్టోబర్ 21 నుంచి ఫామ్‌‌6, డిక్లరేషన్ వేరు చేశాం 
  •     ఒక వార్తా కథనంపై ఆధారపడి పిటిషన్‌‌ వేశారు
  •     దాని ఆధారంగా సీఈసీ తొలగింపు సాధ్యం కాదు
  •     పూర్తి వివరణ ఇచ్చేందుకు అనుమతి కోరిన ఈసీ

 
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌) చేపట్టాలన్న తన నిర్ణయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) సమర్థించుకున్నది. ‘సర్‌‌’ ప్రక్రియను చట్టప్రకారమే చేపట్టామని, దీనికి సంబంధించి జారీ చేసిన మూడు ఉత్తర్వులను సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కలిసే ఆమోదించారని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.  ఓటర్ల నమోదుకు ఉపయోగించే ‘ఫారం 6’లో మార్పులు చేశారని, ఇతర నిర్ణయాలను కూడా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఆదేశం మేరకు ఈసీ సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది.

సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ అఫిడవిట్‌‌ను ఏకగ్రీవంగా ఆమోదించారని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌ (సీఈసీ) జ్ఞానేశ్‌‌ కుమార్‌‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చింది. తమ నిర్ణయాలపై దాఖలైన పిటిషన్లు ఒక వార్తా కథనంపైనే ఆధారపడ్డాయని, వాటిని కొట్టివేయాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన నిర్ణయాల ప్రక్రియ, ఓటరు నమోదు ఫామ్‌‌-6, ఓటర్ల జాబితాలో మార్పులకు సంబంధించిన అంశాలపై వివరణ ఇచ్చింది.

మూడు ‘సర్‌‌‌‌’ ఉత్తర్వులూ ఏకగ్రీవమే

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి 2025 జూన్‌‌, 2025 అక్టోబర్‌‌, 2026 మే నెలల్లో జారీ చేసిన మూడు ఉత్తర్వులనూ ముగ్గురు సభ్యుల కమిషన్‌‌ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఈసీ తెలిపింది. 

సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తోపాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ సంధు, వివేక్‌‌‌‌‌‌‌‌ జోషి ఈ నిర్ణయాలను ఆమోదించారని అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నట్టు వార్తా కథనాలు వెల్లడించాయి. కమిషన్‌‌‌‌‌‌‌‌లో ఫైళ్ల పరిశీలన సమయంలో సభ్యులు చేసే సూచనలు, ప్రశ్నలు, అభిప్రాయాలు లేదా అభ్యంతరాలను తుది నిర్ణయంగా పరిగణించరాదని ఈసీ కోరింది. ఒక ఫైల్‌‌‌‌‌‌‌‌పై చర్చ సందర్భంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనంత మాత్రాన కమిషన్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నట్టు భావించలేమని వాదించింది.

ఫైళ్ల పరిశీలనకు ప్రత్యేక విధానం

ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయాలు ఎలా తీసుకుంటారో కూడా ఈసీ వివరించింది. సంబంధిత విభాగాలు సిద్ధం చేసిన ఫైళ్లను మొదట ఒక ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌కు, ఆ తర్వాత మరో కమిషనర్‌‌‌‌‌‌‌‌కు, చివరగా సీఈసీకి పంపుతారని తెలిపింది. ఆమోదం పొందిన నిర్ణయాలను సంబంధిత ఫైళ్లలో నమోదు చేసి, సభ్యుల సంతకాల అనంతరం అధికారికంగా ప్రకటించి అమలు చేస్తారని పేర్కొన్నది. అత్యవసర పరిస్థితుల్లో సభ్యుల ఆమోదాన్ని ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ విధానంలో తీసుకొని, అనంతరం ఫైల్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. అధికార పరిధిని మించి ఉత్తర్వులు జారీ చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నట్టు బార్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ నివేదించింది.
ఓటర్ల తొలగింపుపైనా వివరణ
ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) అధికారిక ఉత్తర్వులు లేకుండా ఈసీఐనెట్ డేటాబేస్‌‌‌‌‌‌‌‌లో ఓటర్ల పేర్ల చేర్పు లేదా తొలగింపు జరగదని ఈసీ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఐఐటీ, ఐఐఎస్‌‌‌‌‌‌‌‌సీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వివరాలు సరిపోలని ఓటర్లను నేరుగా విచారణకు పిలవకుండా, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) వారి ఇళ్లకు వెళ్లి పత్రాలు సేకరిస్తారని, ప్రత్యేక సందర్భాల్లోనే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లేదా ప్రత్యక్ష విచారణ ఉంటుందని పేర్కొంది. ఇంటర్నల్ ఫైల్‌‌‌‌‌‌‌‌గానీ, నోట్‌‌‌‌‌‌‌‌గానీ మీడియాకు కమిషన్ ఇవ్వలేదని, ఎవరైనా ఇవ్వడానికి అనుమతించలేదని స్పష్టం చేసింది.

మరోవైపు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌పై ఒక వార్తా కథనం ఆధారంగా దాఖలైన పిటిషన్ చట్టపరంగా చెల్లదని, దాన్ని కొట్టివేయాలని కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తప్ప సీఈసీ తొలగింపు లేదా విధులకు ఆటంకం కలిగించడం సాధ్యం కాదని అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో స్పష్టం చేసింది. కమిషన్‌‌‌‌‌‌‌‌లో పని విభజనకు సంబంధించి 2026 జులై 28న జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వుపైనా ఈసీ వివరణ ఇచ్చింది. డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై పనిచేస్తున్న అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ఆ ఉత్తర్వును జారీ చేశారని తెలిపింది. జులై 29న ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ అంశంపై కేబినెట్‌‌‌‌‌‌‌‌ కార్యదర్శికి వేర్వేరుగా లేఖలు రాశారని పేర్కొంది. జులై 30న ఇద్దరు కమిషనర్లు సంయుక్తంగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జులై 28 ఉత్తర్వును అమలు చేయలేదని ఈసీ తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకొని కమిషన్‌‌‌‌‌‌‌‌ నిర్ణయాలపై చేసిన ఆరోపణలు సరైనవి కావని వాదించింది.