- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కాలుష్యరహిత ఇంధనాల దిశగా దేశంలో మరో కీలక అడుగు పడింది. దాదాపు నూటికి నూరుశాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచే ‘ఫ్లెక్స్- ఫ్యూయల్’ వాహనాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ఈమేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (సీఎంవీఆర్)లో సవరణలు చేస్తూ అధికారిక గెజిట్ విడుదల చేసింది. అయితే, ఈ ఇంధనాన్ని ప్రత్యేకంగా రూపొందించి, ధ్రువీకరణ పొందిన వాహనాల్లో మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ తాజా సవరణల ద్వారా కాలుష్య నియంత్రణ ప్రమాణాల పరిధిలోని తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాల గ్రాస్ వెహికల్ వెయిట్ పరిమితిని 3,000 కిలోల నుంచి 3,500 కిలోలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
పాత కార్లలో పోస్తే ఇంజిన్లు ఖతం
ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న సాధారణ పెట్రోల్ వాహనదారులకు ఈ నిర్ణయం వర్తించదు. సాధారణ లేదా ఈ 20 మోడల్ కార్లలో ఈ 85 లేదా ఈ100 ఇంధనాన్ని నింపితే వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని అధికారులు హెచ్చరించారు. మారుతి సుజుకి ఇప్పటికే తీసుకొచ్చిన ‘వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్’లాంటి ప్రత్యేక సాంకేతికత కలిగిన వాహనాల కోసమే ఈ రూల్స్ సవరించారు. ముడిచమురు దిగుమతుల భారం తగ్గించి, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడమే కేంద్రం ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన భద్రతకు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఎంతో మేలుచేస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.
