- ఈ అంశంపై ఎన్జీటీలోనే తేల్చుకోండి
- రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ బెంచ్ స్పష్టం
న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ పరిధిలో డీ సిల్టేషన్ పేరుతో చేపడుతున్న ఇసుక తవ్వకాల అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) విధించిన స్టే పై కలుగజేసుకునేందుకు నిరాకరించింది.
నవంబర్ 5న ఈ కేసు మరోసారి ఎన్జీటీ ముందుకు రానున్న నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ఎండీసీ) ఈ నెల1న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఎన్జీటీ విధించిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. స్థానిక కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు, ఇతర అంశాలను కోర్టు ముందుంచారు. అయినప్పటికీ దీనిపై తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ పేర్కొంది.
ముంపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
వాస్తవానికి ప్రజా అవసరాలు, ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణంతో ములుగు జిల్లాలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపునకు గురవుతుందని వివరించారు. ఇందులో భాగంగా ఈ ఏరియాలో గోదావరి నుంచి 42,95,394 క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని పూనెం రాములు, మరికొంత మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్విరాన్మెంట్పర్మిషన్లు లేకుండానే.. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇసుక తవ్వకాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొన్న ఎన్జీటీ సౌత్ జోన్ బెంచ్ తెలంగాణ ప్రభుత్వం, టీజీఎండీసీ, ములుగు కలెక్టర్ సహా ఇతరులకు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది. తదుపరి విచారణ వరకు ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
