హైదరాబాద్ ప్యార డైజ్ హోటల్‌‌‌‌ కు రూ.20 వేల ఫైన్..

 హైదరాబాద్  ప్యార డైజ్ హోటల్‌‌‌‌ కు రూ.20 వేల ఫైన్..

హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్ వృథా చేస్తున్న ప్యారడైజ్ హోటల్‌‌‌‌కు జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్‌‌‌‌లోని డివిజన్‌‌‌‌-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్‌‌‌‌లో నీటి దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత ఓనర్ కి జరిమానా వేయడంతో పాటు భవిష్యత్తులో తాగు నీటిని వృథా చేయకుండా ఉండాలని హెచ్చరించారు. వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని జలమండలి సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సోమవారం కూకట్‌‌‌‌పల్లి పరిధిలో జల సంరక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

సేవ్ వాటర్ – రీయూజ్ వాటర్ ప్రచార పోస్టర్లను విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు లైన్‌‌‌‌మెన్లకు అనౌన్స్‌‌‌‌మెంట్ పరికరాలను అందజేశారు. ప్రతి ఇంట్లో కనీసం 20 శాతం నీటి వినియోగాన్ని తగ్గించేలా ప్రజలను చైతన్యపరచాలని  ఆదేశించారు. లైన్‌‌‌‌మెన్లు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విధి నిర్వహణ సమయంలో అనౌన్స్‌‌‌‌మెంట్ల ద్వారా నీటి పొదుపు అవసరాలను వివరించాలన్నారు. పైపులైన్లు, ట్యాప్‌‌‌‌ల వద్ద లీకేజీలను గుర్తించిన వెంటనే అరికట్టాలన్నారు. వాహనాలు కడగడం, ఇళ్లను శుభ్రం చేయడం వంటి పనులకు పైపుల ద్వారా చేయకుండా బకెట్లను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగు నీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. నీటిని పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.