కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకి విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజేష్‌ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చేపట్టాయి.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నానికి చెందిన రాజేష్‌ హైదరాబాద్‌లోని నాచారంలో హాస్టల్‌లో ఉంటున్నాడు. మంగళవారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో తన మిత్రులను కలిసేందుకు వచ్చినట్లు సమాచారం. అనంతరం దుర్గం చెరువును సందర్శించేందుకు వెళ్లిన రాజేష్‌ కేబుల్‌ బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత సహాయక బృందాలు చెరువు వద్దకు చేరుకున్నాయి. రాజేష్‌ ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్‌ సోదరి ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.