Megastar- Balaiah: 'అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్‌5'లో చిరంజీవి సందడి? బాలకృష్ణ షోపై భారీ అంచనాలు!

Megastar- Balaiah: 'అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్‌5'లో చిరంజీవి సందడి? బాలకృష్ణ షోపై భారీ అంచనాలు!

టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌కు రంగం సిద్ధమవుతోంది.  ఇద్దరు ఆగ్రనటులు ఒకే వేదికపైకి రాబోతున్నారు. బాక్సాఫీస్‌ను దశాబ్దాలుగా శాసిస్తున్న ఇద్దరు లెజెండ్స్ ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని ముచ్చటించుకోబోతున్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆహా వేదికగా వీరిద్దరు సందడి చేయబోతున్నారన్న వార్త ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. 

'అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్‌5'..

ఓటీటీ రంగంలో రికార్డుల వేట సాగిస్తున్న 'ఆహా' (Aha) టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ NBK' (Unstoppable with NBK) ఐదో సీజన్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.  ఇప్పటికే ఈ పాపులర్ టాక్ షో సీజన్ 5 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈసారి సీజన్-5 గ్రాండ్ ఓపెనింగ్ కోసం మేకర్స్ ప్లాన్ చేసిన గెస్ట్ పేరు విని అభిమానులకు పూనకాలు వస్తున్నాయి.

ఫస్ట్ గెస్ట్ గా చిరు?

ఐదో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కే 'మెగాస్టార్ చిరంజీవి' అతిథిగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దశాబ్దాలుగా వెండితెరపై హెల్తీ కాంపిటీషన్‌తో ప్రేక్షకులను అలరించిన బాలయ్య-చిరుల కాంబినేషన్ ఈ వేదికపై నిజమైతే, అది తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద ఐకానిక్ మూమెంట్‌గా నిలిచిపోతుంది. వీరిద్దరి మధ్య ఉండే ఆత్మీయత, మాస్ టైమింగ్, పాత జ్ఞాపకాలు, పరిశ్రమ ఎదుర్కొన్న హెచ్చుతగ్గుల గురించి చర్చ వస్తే... ఆ ఎపిసోడ్ వ్యూయర్ షిప్ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమాలతో బిజీగా ఇద్దరు స్టార్స్..

ప్రస్తుతం చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న 'కాకా' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.  మరోవైపు బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న 'దాదా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24, 2026న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. 

అధికారిక ప్రకటన ఎప్పుడో?

ఇప్పటికే చిరంజీవి పేరు తెరపైకి రావడంతో ' అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సీజన్ 5పై అంచనాలు పెరిగాయి. అయితే, తొలి అతిథి ఎవరన్నది, కొత్త సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. నిజంగానే మెగాస్టార్ ఈ షోకు వస్తే మాత్రం బుల్లితెరపై సందడి మామూలుగా ఉండదు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.