Ramayana: రామాయణ ‘మంగళ్ రంగ్’ పాటపై నెటిజన్ల విమర్శలు.. ఇంతకీ ఖవ్వాలి అంటే ఏంటి?

Ramayana: రామాయణ ‘మంగళ్ రంగ్’ పాటపై నెటిజన్ల విమర్శలు.. ఇంతకీ ఖవ్వాలి అంటే ఏంటి?

‘రామాయణ’ సినిమాలోని ‘మంగళ్ రంగ్’.. తెలుగులో ‘రంగులే రంగులే’ పాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలో ఖవ్వాలీ, సూఫీ సంగీత ఛాయలు ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరు రెహమాన్ గతంలో స్వరపరిచిన ‘కున్ ఫయా కున్’ పాటతో పోలుస్తూ, కొత్తదనం తగ్గిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, పాటలో సీతాదేవి రాముడి హల్దీ వేడుకలో కనిపించడంపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే, కొందరు మాత్రం రెహమాన్ సంగీత ప్రయోగాలకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో పాటపై ప్రశంసలు, విమర్శలు రెండూ వ్యక్తమవుతున్నాయి. మరి రెహామన్ కంపోజ్ చేసిన ‘మంగళ్ రంగ్’ ట్యూన్ & గత సినిమాల సాంగ్స్ పై వచ్చే రియాక్షన్స్ ఇలా ఉన్నాయి...

‘రామాయణంలో ఖవ్వాలీనా?’.. నెటిజన్ల ప్రశ్నలు

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’ ఇప్పటికే ఎన్నో అంచనాలను పెంచింది. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పాటలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘మంగళ్ రంగ్’ మాత్రం ప్రశంసలతో పాటు విమర్శలను కూడా మూటగట్టుకుంది. పాటలోని కోరస్, సంగీతపు మేళవింపు, సింగర్స్ పాడే శైలి ఖవ్వాలీ లేదా సూఫీ సంగీతాన్ని గుర్తు చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటను అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించారు. రాముడు, సీతల ప్రేమ, పవిత్ర బంధం, వివాహ వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. అయితే పాటలో వినిపించే సంగీతం రామాయణం కథకు తగినట్టుగా లేదంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఖవ్వాలీ (ఒక ప్రసిద్ధ సూఫీ ఇస్లామిక్ భక్తి సంగీత ప్రక్రియ) సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తారంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాముడు, సీతల వివాహ ఘట్టానికి భారతీయ సంప్రదాయ సంగీతం, భక్తి భావాన్ని ప్రతిబింబించే స్వరాలు మరింత సరిపోతాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరేమో సంగీతానికి మతం లేదని, ఒక సంగీత ప్రక్రియను మరో కథలో ఉపయోగించడం తప్పు కాదని వాదిస్తున్నారు. పాటను కేవలం సంగీత శైలి కోణంలో కాకుండా, దాని భావం, సాహిత్యం, సినిమాలోని సందర్భం ఆధారంగా అంచనా వేయాలని సూచిస్తున్నారు. అయితే ఈ పాట నిజంగా ఖవ్వాలీనేనా? లేక విభిన్న సంగీత శైలులను కలిపిన ప్రయోగమా? అనే విషయంలో మాత్రం అందరూ ఒకే అభిప్రాయంతో లేరు. కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు రెహమాన్ సంగీత ప్రయోగాలను సమర్థిస్తున్నారు. దీంతో ‘మంగళ్ రంగ్’ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 

సీతమ్మ హల్దీ వేడుకకు రావడంపై మరో వివాదం..

పాటలోని సంగీతం ఒకవైపు చర్చకు దారితీస్తుంటే, వీడియోలో కనిపించే ఓ సన్నివేశం మరో వివాదానికి కారణమైంది. రాముడికి పసుపు పూస్తున్న సమయంలో సీతాదేవి పక్కనే కనిపించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. సంప్రదాయ హిందూ వివాహాల్లో అనేక ప్రాంతాల్లో వధూవరుల హల్దీ వేడుకలను వేర్వేరుగా నిర్వహిస్తారని, అలాంటప్పుడు సీతాదేవి రాముడి వేడుకలో ఎందుకు ఉన్నారంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ సన్నివేశం పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకనే సూచిస్తోందని ఇప్పుడే చెప్పలేం. కొందరు ప్రేక్షకులు అది రాముడి పట్టాభిషేకానికి సంబంధించిన ఆచారం కావచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. అసలు ఆ సన్నివేశం ఏ సందర్భంలో వస్తుందనే విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

కొత్త ట్యూన్లు ఏమయ్యాయి రెహమాన్? నెటిజన్ల విమర్శలు

ఏఆర్ రెహమాన్ సంగీతంపై ఇప్పుడు నెట్టింట మరో చర్చ మొదలైంది. ‘మంగళ్ రంగ్’ పాట విన్న కొందరు నెటిజన్లు.. రెహమాన్ కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్నారా? లేక గతంలో తాను ఇచ్చిన ట్యూన్లనే మళ్లీ తిప్పి వినిపిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ‘రాక్‌స్టార్’ సినిమాలోని ‘కున్ ఫయా కున్’ పాటను గుర్తు చేస్తూ, ‘మంగళ్ రంగ్’లోనూ అలాంటి సంగీత ఛాయలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, తమిళ చిత్రం ‘కందుకొండేన్ కందుకొండేన్’లోని ‘ఎన్న సొల్ల పోగిరాయ్’ పాటతోనూ పోలికలు చూపిస్తున్నారు. దీంతో రెహమాన్ తన పాత సంగీత శైలినే మళ్లీ ఉపయోగిస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. 

సోషల్ మీడియాలో ట్రోలింగ్: రెహమాన్‌కు మద్దతుగా కొందరు

‘మంగళ్ రంగ్’ పాటపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఈ పాటలో ఖవ్వాలీ, సూఫీ సంగీత ఛాయలు ఎక్కువగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. మరికొందరు ‘రాక్‌స్టార్’ సినిమాలోని ‘కున్ ఫయా కున్’ పాటతో పోలుస్తూ, రెహమాన్ కొత్త ట్యూన్‌తో రావడానికి బదులుగా తన పాత సంగీత శైలినే మళ్లీ ఉపయోగిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే, మరో వర్గం నెటిజన్లు మాత్రం ఈ విమర్శలను వ్యతిరేకిస్తున్నారు. సంగీతంలో విభిన్న శైలులను కలపడం తప్పు కాదని, ప్రతి పాటలోనూ సంప్రదాయ వాద్యాలే ఉండాలనే నియమం లేదని అభిప్రాయపడుతున్నారు. పాటను పూర్తిగా విన్న తర్వాతే దానిపై ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. ఇలా ‘మంగళ్ రంగ్’ కొందరి ప్రశంసలు అందుకుంటుండగా, మరికొందరి విమర్శలను ఎదుర్కొంటోంది.

భారీ అంచనాల మధ్య ‘రామాయణ’

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ విమర్శలు సినిమా విడుదలయ్యే వరకు కొనసాగుతాయా? లేక పూర్తి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందా? అనేది వేచి చూడాలి. కాగా ఈ ‘రామాయణ’ చిత్రం దీపావళి కానుకగా 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.