స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం.. కూటమి అభ్యర్థులను గెలిపించాలి: పవన్ కళ్యాణ్

 స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం.. కూటమి అభ్యర్థులను గెలిపించాలి: పవన్ కళ్యాణ్

అమరావతి:  ఏపీ  స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, క్షేత్రస్థాయిలోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రకటించిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొంత క్లిష్టమైన ప్రక్రియ అని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి స్ఫూర్తిని ప్రతిబింబించేలా సీట్ల సర్దుబాటు చేసుకున్నామని వివరించారు.

సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సీట్ల సర్దుబాటు విషయంలో కసరత్తు చేశారని పవన్ కళ్యాణ్  తెలిపారు. పోటీలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కని వారికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. గ్రామస్థాయిలోనూ కూటమి ఐక్యతను చాటుతూ అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రహదారులు, పశువుల నీటి తొట్లు వంటి మౌలిక సదుపాయాల పనులు చేపట్టినట్లుతెలిపారు. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ఆవాసాలకు రహదారి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద సుమారు రూ.30 వేల కోట్లతో సురక్షిత తాగునీటి సరఫరా పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 3.20 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏపీకి పెట్టుబడులు

కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు.ఉద్యోగులకు గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయని , చంద్రబాబు నాయకత్వంలో సుమారు రూ.30 వేల కోట్ల చెల్లింపులు చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కూడా ఆయన అన్నారు.