ఇజ్రాయెల్‌లో మంగళవారం (అక్టోబర్ 27) అత్యంత కీలకమైన పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. హమాస్ మెరుపు దాడి, గాజా, లెబనాన్, ఇరాన్‌లతో మూడేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సుమారు 73 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజకీయ భవితవ్యానికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష. ప్రధాని నెతన్యాహు మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా.. మాజీ సైనికాధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఆయనకు సవాల్ విసురుతోంది. ఈ ఎన్నికలు నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుతో పాటు ఇజ్రాయెల్ భద్రతా విధానాలు, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపనుండగా.. ఒకవేళ నెతన్యాహు ఓడిపోతే జైలుకు వెళ్లక తప్పదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నెతన్యాహు ప్రస్తుత సవాళ్లు..
2023 అక్టోబర్ 7న హమాస్ దాడులను అడ్డుకోవడంలో జరిగిన భద్రతా వైఫల్యాలు నెతన్యాహు ప్రభుత్వంపై విమర్శలకు కారణమయ్యాయి. అనంతరం గాజాలో చేపట్టిన సైనిక చర్యలు, హిజ్బుల్లా, ఇరాన్‌తో ఘర్షణలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా మారాయి. ప్రభుత్వ సైనిక చర్యలను నెతన్యాహు సమర్థించుకుంటుండగా.. ప్రత్యర్థులు భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహించాలని, దాడులపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాల ప్రభావం, దేశ భద్రత, జీవన వ్యయం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ప్రతిష్ఠ వంటి అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి.
కీలక ప్రత్యర్థులు వీళ్లే..
బెంజమిన్ నెతన్యాహు అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా.. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్, మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్‌కోట్,ప్రతిపక్ష నేత యైర్ లాపిడ్‌తో సహా కీలక నేతల నుంచి నెతన్యాహు గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. మరికొందరు నేతలు అవిగ్డోర్ లిబర్‌మాన్ ,యైర్ గోలన్ కూడా కీలక పోటీదారులుగా ఉన్నారు. ఫలితం కేవలం వ్యక్తిగత పార్టీలు గెలుచుకున్న ఓట్లపైనే కాకుండా, ఇజ్రాయెల్ 120 మంది సభ్యుల క్నెసెట్‌లో పాలక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. అధికారం చేపట్టాలంటే పార్టీకి కనీసం 61 సీట్లు అవసరం.
ఐసెన్కోట్తో పాటు ఇతరుల సవాల్
నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా మాజీ సైనికాధిపతి గాడి ఐసెన్‌కోట్ నిలిచారు. ఆయన యషార్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. యుద్ధాల తర్వాత దేశాన్ని ఏకం చేయడం, భద్రతా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం తన లక్ష్యమని ఐసెన్‌కోట్ చెబుతున్నారు. అయితే పాలస్తీనా దేశ ఏర్పాటుపై ఆయన వ్యతిరేక వైఖరి, సైనిక చర్యల విషయంలో కఠినమైన అభిప్రాయాలు కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్, అవిగ్డోర్ లిబర్‌మాన్, యైర్ గోలన్ కూడా కీలక పోటీదారులుగా ఉన్నారు. నెతన్యాహు లికుడ్ పార్టీకి మద్దతుగా మితవాద, మతపరమైన పార్టీలు ఉండగా.. ప్రతిపక్ష శిబిరంలోనూ విభిన్న రాజకీయ ధోరణులున్నాయి.
61 సీట్లే కీలకం.. సంకీర్ణమే నిర్ణయాత్మకం
ఇజ్రాయెల్ పార్లమెంటు క్నెసెట్‌లో మొత్తం 120 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక్కడ ఓటర్లు ప్రధానమంత్రిని నేరుగా ఎన్నుకోరు. రాజకీయ పార్టీలకు ఓటు వేస్తారు. దేశవ్యాప్తంగా పోలైన ఓట్ల ఆధారంగా పార్టీలకు సీట్లు కేటాయిస్తారు. పార్లమెంటులో ప్రవేశించాలంటే ఒక పార్టీ కనీసం 3.25 శాతం ఓట్లు సాధించాలి. ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో చిన్న పార్టీల మద్దతు కీలకం కానుంది. నెతన్యాహు పార్టీ అత్యధిక సీట్లు సాధించినా, అవసరమైన మిత్రపక్షాల మద్దతు లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే. ప్రతిపక్షం కూడా ఇదే సవాల్‌ను ఎదుర్కొంటోంది.
అవినీతి కేసులు.. అంతర్జాతీయ ఒత్తిడి
నెతన్యాహు మూడు అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. గాజా యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ కూడా ఆయనపై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచింది. అయితే ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఆయన వెంటనే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పలేం. న్యాయపరమైన ప్రక్రియలు వాటి నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలు, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు కూడా ఎన్నికల చర్చల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఫలితాలు ఎప్పుడంటే?
పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ద్వారా తొలి అంచనాలు, ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అధికారిక ఫలితాలు నవంబర్ 4లోగా ప్రకటించనున్నారు. అనంతరం అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి మెజారిటీ కూటమిని ఏర్పాటు చేయడానికి రోజులు లేదా వారాలు పట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధించారన్నదే కాకుండా, ఎవరు 61 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరన్నదే అసలు ప్రశ్న. అదే నెతన్యాహు భవిష్యత్తును, ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వ దిశను నిర్ణయించనుంది.
