- DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన DNPA
- సమ్మతి నిబంధనలతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ముప్పు అని వాదన
- న్యూస్‌రూమ్‌లపై ఆంక్షలు, సెన్సార్‌షిప్ ప్రమాదం ఉందన్న DNPA
- కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- నవంబర్ 17కు తదుపరి విచారణ
- గోప్యత, పత్రికా స్వేచ్ఛ మధ్య సమతుల్యత అవసరమన్న సీజేఐ
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం-2023 నిబంధనలు జర్నలిజం స్వేచ్ఛపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం (అక్టోబర్27) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే, చట్టం అమలుపై మధ్యంతర స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ కేసు విచారణ నవంబర్ 17 కు వాయిదా వేసింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట DNPA తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. ఈ చట్టం వార్తా సేకరణ, పరిశోధనాత్మక జర్నలిజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలు ప్రచురించడానికి ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తే సకాలంలో సమాచారాన్ని ప్రజలకు అందించడం కష్టమవుతుందని అన్నారు. కొన్ని అంశాలను రిపోర్ట్ చేయడానికి అనుమతి కోరాల్సిన పరిస్థితి ఏర్పడితే న్యూస్‌రూమ్‌ల పనితీరు దెబ్బతింటుందని, ఇది సెన్సార్‌షిప్‌కు దారితీయవచ్చని వాదించారు.
DPDP చట్టంలోని పలు నిబంధనలను మార్చాలని DNPA పిటిషన్‌లో కోరింది. ఈ చట్టంతో పరిశోధనాత్మక కథనాలు ప్రచురించడం కష్టమవడంతో పాటు, జర్నలిస్టుల ప్రైవసీకి ముప్పు ఏర్పడవచ్చని వార్తా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, ప్రజాప్రయోజనాల దృష్ట్యా కొన్ని సమాచారాలను నిరోధించడం వంటి అధికారాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని మీడియా యాజమాన్యం అభిప్రాయవ్యక్తం చేసింది. ఈ కేసులో కేంద్రం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రైవసీ హక్కును పరిరక్షిస్తూనే పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలన్నది DNPA వాదించింది.
