వైయస్ ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న పోలీసులు, అధికారులకు ఆ పార్టీ చీఫ్ వైయస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 2026 అక్టోబర్ 27 న వైయస్ఆర్ జిల్లా, పులివెందుల పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ సందర్భంగా .. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే వదిలేదని లేదన్నారు.
చంద్రబాబు పాలనలో శకుని మాయాపాచికలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితి ఉందన్నారు జగన్. ఎన్నికల నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎస్ఈసీ, పోలీసు అధికారులు, ఇతర వ్యవస్థలు ఉండీ లేనట్టుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని ఆరోపించారు.
గతంలో పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్ గురించి విన్నాం.. ఇప్పుడు ఏకంగా నామినేషన్ కేంద్రాలనే ఆక్రమించి నామినేషన్ల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందరికీ పోటీ చేసే అవకాశం ఇచ్చి గెలిస్తేనే నిజమైన విజయమని.. ప్రత్యర్థులను పోటీకి రానివ్వకుండా తప్పించి గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
17 పట్టణ స్థానిక సంస్థలు కూటమి ఖాతాలోకి వచ్చాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా? చైర్పర్సన్ ఎన్నికల్లో టీడీపీకి 15, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి అంటూ ఏకగ్రీవాల ప్రచారం చేసుకోవడమేనా ప్రజాస్వామ్యం? 2,108 వార్డుల్లో 21 శాతం ఏకగ్రీవాలంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థులకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా సాధించిన విజయాలు నిజమైన విజయాలా? అని ప్రశ్నించారు.
చంద్రబాబూ.. ఎన్నికల్లో నిజమైన పోటీని ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నావు? ప్రత్యర్థులను పోటీకి రానివ్వకుండా చేయడమేనా నీ ఘనత? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి? ఎన్నికల సమయంలో ఇంటింటికీ పంచిన బాండ్లు చూపించి ప్రజలు నిలదీస్తున్నారు.. 43 హామీలు ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదు. ప్రజల దగ్గరకు వెళ్లే ధైర్యం లేకే ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నారని విమర్శించారు.
ఎన్నికల అక్రమాలను ప్రశ్నించాల్సిన పత్రికలు, టెలివిజన్లు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాయి. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నా అక్కచెల్లెమ్మలే ఎక్కువగా నష్టపోతున్నారు.. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాల్సిన సమయంలో వారికి అండగా నిలవాల్సింది పోయి నడిరోడ్డుపై అడ్డుకుంటున్నారు.
చెక్‌పోస్టులు పెట్టి మహిళా అభ్యర్థులను అడ్డుకోవడం, టీడీపీ గుండాలు దాడులు చేయడం, చీరలు లాగడం, నామినేషన్ పత్రాలు చించేయడం దారుణం ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళల కోసం ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ పథకాలతో అండగా నిలిచామని చెప్పారు. పిల్లల చదువుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన అందించాం.. నేరుగా వారి కుటుంబాల ఖాతాల్లోకి ఆర్థిక సాయం అందించాం.. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, 21 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టి అండగా నిలిచాం.. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళల రాజకీయ, సామాజిక పురోగతికి బాటలు వేశామని తెలిపారు.
పులివెందలలో 40 వార్డులుంటే కేవలం 20 వార్డులకు మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. పులివెందలలో ఏడు జెడ్పీటీసీ స్థానాలకు గాను కేవలం నాలుగు స్థానాల్లోనే పోటీ జరిగే పరిస్థితి కల్పించారు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వారిపై తుపాకులతో 37 రౌండ్లు కాల్పులు జరిపారు. పులివెందలలో 924 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారు. మా వాళ్లపై కాల్పులు జరిపి, వారిపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏ రకమైన న్యాయం? అని ప్రశ్నించారు.
కడప జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలకు పోటీ లేకుండా చేశారు. ఆరు చోట్ల నామినేషన్లు వేయనివ్వలేదు. మరో 11 చోట్ల అర్ధరాత్రి దాటాక పరిశీలన పేరుతో నామినేషన్లు తిరస్కరించారు. పోలీసులు, అధికారుల సమక్షంలోనే మా నామినేషన్ పత్రాలు చించేశారు. మా హక్కులను లాగేసుకున్నారు. రేపు మన ఆస్తి పత్రాల విషయంలోనూ ఇదే జరిగితే పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తిరగబడాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య తేడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని అన్నారు. . రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని చెప్పారు.
