గోదావరిఖని: తమ గ్రామానికి ఆనుకుని ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామ యువకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ గ్రామ సమస్యను వివరించి, వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరేందుకు హైదరాబాద్ సచివాలయం వరకు బయలుదేరారు. ఈ క్రమంలో యువకుల సైకిల్ యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకుంది.
ఈ నెల 26న గుండి గ్రామం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర పెద్దపల్లి జిల్లా మీదుగా హైదరాబాద్కు చేరుకోనుంది. ముఖ్యమంత్రిని కలిసి తమ గ్రామానికి ఎదురవుతున్న రవాణా సమస్యను వివరించి, వాగుపై వంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు యువకులు తెలిపారు.
గుండి గ్రామానికి సమీపంలోని వాగుపై వంతెన నిర్మిస్తే జిల్లా కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే చేరుకోవచ్చని యువకుడు సురేష్ తెలిపారు. ప్రస్తుతం వంతెన లేకపోవడంతో సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య కారణంగా గ్రామ ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వర్షాకాలం వచ్చిందంటే వాగు కారణంగా గ్రామం నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని యువకులు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు పొందడం, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారుతోందని వివరించారు. వంతెన లేకపోవడం వల్ల తమ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 20 ఏళ్లుగా వంతెన నిర్మాణం కోసం విజ్ఞప్తులు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని సురేష్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి ఆనుకుని ఉన్న వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. తమ గ్రామ ప్రజల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సమస్యకు పరిష్కారం సాధించడమే సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశమని యువకులు పేర్కొన్నారు.
