AI ఇన్ఫ్రా ఏర్పాటు కోసం భారీగా ఖర్చు చేస్తున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తన ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని దాదాపు 60వేల మంది ఉద్యోగులకు ఈ బైఔట్ ఆఫర్‌ను వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఇది ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 2లక్షల 23వేల మంది ఉద్యోగుల్లో నాలుగో వంతు కంటే ఎక్కువే.
మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆమీ కోల్మన్ సోమవారం ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఆఫర్ జనరల్ మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ స్థాయిల వరకు ఉన్న ఉద్యోగులకు అందుబాటులో ఉంది. ఈసారి వయోపరిమితి గానీ, సర్వీసు కాలం నిబంధనలు గానీ లేవు. ఉద్యోగంలో ప్రతిభతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత నిబంధనలతో ఇమెయిళ్లు వస్తాయి. డిసెంబర్ మొదటి వారం లోపు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించగా.. అంగీకరించిన వారు ఏడాది చివరి నాటికి కంపెనీ నుంచి వెళ్లిపోతారు.
ఈ బైఔట్ ఆఫర్ కింద మైక్రోసాఫ్ట్ తన సాధారణ సెవరెన్స్ ప్యాకేజీనే వర్తింపజేస్తోంది. ఇందులో పనిచేసిన కాలం, స్థాయి ఆధారంగా బేస్ పే, స్టాక్ వెస్టింగ్ కంటిన్యూయేషన్, నిర్దిష్ట కాలానికి హెల్త్‌కేర్, కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్ లభిస్తాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఇచ్చిన రిటైర్మెంట్ ప్రోగ్రామ్‌లో ఉన్నట్లుగా పొడిగించిన హెల్త్‌కేర్ బెనిఫిట్స్ ఇందులో ఉండవు. అమెరికాలో ఈ ఏడాది జరిగిన లేఆఫ్స్ లో సెవరెన్స్ ప్యాకేజీ 60 రోజుల బేస్ పేతో ప్రారంభమై, గరిష్టంగా 39 వారాల వరకు ఇవ్వబడింది. లెవెల్ 64 అంతకంటే తక్కువ ఉన్నవారికి ప్రతి 6 నెలల సర్వీసుకు ఒక వారం బేస్ పే, లెవెల్ 65 నుంచి 67 వరకు ఉన్నవారికి 2 వారాల చొప్పున చెల్లించారు.
ఈ ఆఫర్ అన్ని విభాగాలకు వర్తించదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. సేల్స్, మార్కెటింగ్, కమర్షియల్ బిజినెస్, సెక్యూరిటీ, డిస్కవరీ అండ్ క్వాంటం టీమ్స్ ఈ ఆఫర్ నుంచి మినహాయించబడ్డాయట. కోపైలట్, కోర్ ఏఐ, విండోస్ అండ్ డివైసెస్, ఎక్స్‌బాక్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాలు దీనిలో భాగం కాగా.. క్లౌడ్ + ఏఐ, మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగాలు పాక్షికంగా మాత్రమే అర్హత కలిగి ఉన్నాయని తెలుస్తోంది. అంటే కంపెనీ తన ఏఐ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉద్యోగులను తొలగిస్తోందన్నమాట. అంటే ఏఐ స్కిల్స్ ఉన్న వ్యక్తులకు సైతం రానున్న రోజుల్లో జాబ్ గ్యారెంటీ అస్సలు లేదని తాజా పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న మైక్రోసాఫ్ట్.. ఆపరేటింగ్ ఖర్చులను నియంత్రించే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా బైఔట్ ఆఫర్‌ను ఎంతమంది ఉద్యోగులు స్వీకరిస్తారనే దానిపైనే రాబోయే కాలంలో ఈ విధానం కొనసాగింపు ఆధారపడి ఉండనుంది.
