అరే ఏంట్రా బాబు ఈ జెన్‌జీ పోరగాళ్లు ఇలా ఉన్నారు. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తే ఎలా? గర్ల్‌ఫ్రెండ్ పరీక్షల్లో ఫెయిల్ అయితే.. పెళ్లి ఆలస్యం అవుతుందనే టెన్షన్‌తో ఏకంగా స్కూల్‌కే నిప్పు పెట్టేశాడో ప్రబుద్ధుడు. ప్రేమంటే ఇద్దరి మధ్య పరస్పర సపోర్ట్ ఉండాలి కానీ.. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడితే జీవితమే బలి అవుతుందని ఈ మగ మహారాజుకి ఎవరు చెప్పాలి? సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ఈ విచిత్రమైన ఘటన ఈజిప్ట్‌లో జరిగింది. ఇక్కడ ఓ 21 ఏళ్ల యువకుడికి తన ప్రేయసితో పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆమె రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయింది. దీంతో తన పెళ్లికి ఎక్కడ బ్రేక్ పడుతుందో, ఆలస్యం జరుగుతుందోనని ఈ కిలాడీ ప్రేమికుడికి టెన్షన్ పట్టుకుంది. ఆ భయంతో ఏకంగా ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ తగలపెట్టేయాలని ఫిక్స్ అయ్యాడు. నేరుగా స్కూల్ కంట్రోల్ రూమ్‌లోకి ప్రవేశించి నిప్పు పెట్టేశాడు.
ఈ మంటల్లో స్కూల్ ఆస్తులతో పాటు ఎంతోమంది విద్యార్థులకు సంబంధించిన రికార్డ్స్ కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఆ ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి ఆలస్యం కాకూడదని చేసిన ఈ ఓవరాక్షన్ కాస్తా ఇప్పుడు అతన్ని నేరుగా ఊచలు లెక్కపెట్టేలా చేసింది.
నిజానికి జీవితంలో కష్టసుఖాలు రావడం సహజం.. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ చదివి పాస్ కావచ్చు. అంతేకానీ ఇలా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తూ, పిచ్చి పనులకు పాల్పడితే భవిష్యత్తే నాశనమవుతుంది. ప్రేమ పేరుతో ఇలాంటి తుగ్లక్ పనులు చేసే ముందు జెన్‌జీ కిడ్స్ కాస్త ఆలోచించుకుని సరైన దారిలో వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
