బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన దేశం విడిచి వెళ్లాలన్న నోటీసుపై తాత్కాలిక స్టే విధించడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 28లోపు భారత్ విడిచి వెళ్లాలంటూ విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) జారీ చేసిన డెడ్‌లైన్ నుంచి ఆయనకు తాత్కాలిక విముక్తి లభించింది.
అసలు ఏం జరిగింది?
అక్టోబర్ 10న ముంబైలోని చారిత్రాత్మక ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద ఎలక్షన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. తన భాగస్వామి లేఖా వాషింగ్టన్, చెల్లెలు జైన్ మేరీ ఖాన్‌లతో కలిసి పాల్గొన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం ఉండి, 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' (OCI) కార్డ్ కలిగిన ఇమ్రాన్, నిరసనల్లో పాల్గొనడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025' కింద అక్టోబర్ 14న ఆయనకు లీవ్ ఇండియా నోటీసు పంపారు.
బాంబే హైకోర్టుకు ఇమ్రాన్..
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు సమాచారం, వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 హక్కులను కాలరాయడమేనని ఆయన లాయర్లు వాదించారు. చీఫ్ జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేత్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
►ALSO READ | Arnab Cyclone: ‘అర్నబ్’ తుఫాను ఎఫెక్ట్.. 2 రోజులు థియేటర్లు బంద్.. అక్టోబర్ 30 సినిమాల విడుదలపై టెన్షన్!
తాత్కాలిక ఊరట..
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుబాటులో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కొంత సమయం కోరింది. నవంబర్ 2 వరకు ఇమ్రాన్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని, ఆయనను దేశం నుంచి పంపించేది లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఈ హైడ్రామా తదుపరి విచారణ నవంబర్ 2 మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. దీంతో అప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ భారత్‌లోనే ఉండేందుకు మార్గం సుగమమైంది.
