Director BP Singh: CID అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. డైరెక్టర్ బీపీ సింగ్ కన్నుమూత..

Director BP Singh: CID అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. డైరెక్టర్ బీపీ సింగ్ కన్నుమూత..

ఇండియన్ టెలివిజన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు, నిర్మాత, ‘CID’ సిరీస్ సృష్టికర్త బీపీ సింగ్ (Brijendra Pal Singh) కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణవార్తతో టెలివిజన్ రంగంలో విషాదం నెలకొంది. ‘CID’, ‘ఆహట్’ వంటి సూపర్‌హిట్ సిరీస్‌లతో ప్రేక్షకులకు చేరువైన బీపీ సింగ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

CIDతో దేశవ్యాప్తంగా గుర్తింపు..

బీపీ సింగ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది ‘CID’ సీరియల్. 1998లో ప్రారంభమైన ఈ క్రైమ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఉత్కంఠభరితమైన కథనాలతో ఈ షో దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్‌కు సృష్టికర్తగా, దర్శకుడిగా, నిర్మాతగా బీపీ సింగ్ వ్యవహరించారు. అంతేకాకుండా ఇందులో డీసీపీ శంషేర్ సింగ్ చిత్రోలే పాత్రలోనూ కనిపించి అభిమానులను అలరించారు.

ఆహట్‌తోనూ ప్రత్యేక గుర్తింపు..

కేవలం క్రైమ్ సిరీస్‌లకే కాకుండా హారర్ షోలతోనూ బీపీ సింగ్ మంచి పేరు సంపాదించారు. 1995లో ప్రారంభమైన ‘ఆహట్’ హారర్ సిరీస్ ప్రేక్షకుల్లో భయాన్ని, ఉత్కంఠను కలిగించింది. ఈ కార్యక్రమం వివిధ దశల్లో 2015 వరకు ప్రసారమైంది. కెమెరామెన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన బీపీ సింగ్.. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగి టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా బీపీ సింగ్ కెరీర్‌లో 12 సిరీస్‌లు, రెండు సినిమాలను రూపొందించారు.

►ALSO READ | ఇమ్రాన్ ఖాన్ కేసులో కీలక మలుపు.. 'లీవ్ ఇండియా' నోటీసుపై బాంబే హైకోర్టులో ఊరట!

సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

బీపీ సింగ్ మరణంపై దర్శకుడు అశోక్ పండిట్ సంతాపం వ్యక్తం చేశారు. ‘CID’, ‘ఆహట్’ వంటి సిరీస్ లతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న గొప్ప దర్శకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీపీ సింగ్‌తో తనకు సన్నిహిత అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు.

మరోవైపు ‘CID’లో దయా పాత్రతో గుర్తింపు పొందిన నటుడు దయానంద్ శెట్టి కూడా బీపీ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పని పట్ల ఎంతో అంకితభావంతో ఉండేవారని, కంటెంట్ రూపొందించడమే తన జీవితంగా భావించేవారని తెలిపారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేదని వెల్లడించారు.

టెలివిజన్ రంగానికి తీరని లోటు..

బీపీ సింగ్ రూపొందించిన ‘CID’, ‘ఆహట్’ కార్యక్రమాలు కేవలం వినోదానికే పరిమితం కాలేదు. భారతీయ టెలివిజన్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్, హారర్ కథనాలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా CIDలోని పాత్రలు, డైలాగులు, పరిశోధనా శైలి ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన భౌతికంగా దూరమైనా, భారతీయ టెలివిజన్‌కు అందించిన సేవలు, సృష్టించిన పాత్రలు అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. బీపీ సింగ్ అంత్యక్రియలు అక్టోబర్ 28న నిర్వహించనున్నట్లు అశోక్ పండిట్ తెలిపారు.