ఏపీలో స్థానిక ఎన్నికల కేంద్రంగా జరుగుతున్న హైడ్రామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ అంశంలో సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మొట్టికాయలు కూడా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో నామినేషన్లకు రెండు రోజుల గడువు కూడా పెంచి, ఎన్నికల తేదీని నవంబర్ 1కి మార్చారు. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో వైసీపీ అధినేత జగన్ పులివెందులలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ( అక్టోబర్ 27 ) పులివెందులలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. పులివెందులలో తమ వాళ్లపై చెయ్యి వేస్తే.. తనపై వేసినట్టే అని, షర్ట్ మడతపెట్టా.. ఇప్పుడు ఎవడొస్తాడో రండి చూసుకుందాం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ని మరింత పెంచాయి.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున పులివెందులలోనే ఉంటానని.. ఎంత మంది వస్తారో రండి.. గట్టిగా తగులుదాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. ప్రజాస్వామ్యంలో ఎవరు మంచి చేశారో ప్రజలు వాళ్లకు మాత్రమే తోడుగా నిలబడతారని సంకేతం ఖచ్చితంగా పంపిస్తామని అన్నారు.
కార్యకర్తల మీద పడ్డ దెబ్బను చూస్తూ ఊరుకోనని.. జగన్ 2.0లో జగన్ ఒకటైతే.. రెండోది కార్యకర్తేనని అన్నారు జగన్. కార్యకర్తలు తోడుగా నిలబడ్డారు కాబట్టే తాను సీఎం అయ్యానని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు జగన్. మన హక్కులు మనమే కాపాడుకోవాలని.. తిరగబడాలని..మీ అన్న మీకు తోడుగా ఉంటాడని అన్నారు జగన్. పులివెందులలో కొడితే.. చెంప గుయ్ మానాలని.. పులివెందుల సౌండ్ రాష్ట్రంలో మొగాలని అన్నారు జగన్.
ALSO READ : మద్యం ప్రియులకు షాక్: వైన్ షాపులో బిల్లు వెయ్యి దాటితే..
పోలీసులు డ్యూటీ చేస్తున్నది చంద్రబాబు కోసం కాదని... టోపీ మీద ఉన్న మూడు సింహాలను చూసి డ్యూటీ చేయాలని అన్నారు జగన్. ప్రజలకు రక్షకులుగా ఉండాల్సినవారే దౌర్జన్యం చేస్తే కాపాడేదెవరని ప్రశ్నించారు. అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు జగన్.
