పవర్‌ప్లేలో ఎలా ఆడాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. న్యూజిలాండ్ ఓటమిపై శాంట్నర్ కీలక వ్యాఖ్యలు

పవర్‌ప్లేలో ఎలా ఆడాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. న్యూజిలాండ్ ఓటమిపై శాంట్నర్ కీలక వ్యాఖ్యలు

Mitchell Santner: వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20 (3rd T20I) మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3–0 తేడాతో కివీస్ చేజార్చుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అభిషేక్ శర్మ సెంచరీ (113)తో చెలరేగడంతో కేవలం 13.2 ఓవర్లలోనే టార్గెట్ ని ఛేదించడంపై బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పవర్‌ప్లేలో ఎలా ఆడాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి: 

మ్యాచ్ తర్వాత శాంట్నర్ మాట్లాడుతూ.. ఈ టీ20 ఫార్మాట్‌లో పవర్‌ప్లే చాలా కీలకం, పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లు (అభిషేక్, వైభవ్) ఎలా ఆడాలో మళ్ళీ చేసి చూపించారు.. వారిని చూసి మేము ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని ఒప్పుకున్నాడు. ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నప్పుడు వారిని అడ్డుకోవడం చాలా కష్టం, ఐపీఎల్‌లోనూ ఇలాంటి పరిస్థితులను తాము చూశాం, ఇప్పుడు న్యూజిలాండ్‌లో కూడా అదే రిపీట్ అయిందన్నాడు. 

200 రన్స్ చేసినా కాపాడుకోలేకపోయాం: 

టాస్ ఓడిపోయినప్పటికీ డారిల్ మిచెల్ (89), ఫిన్ అలెన్ (40) రాణించడంతో 200 పరుగుల దిశగా వెళ్లాం.. ఈ పిచ్‌పై 200 రన్స్ మంచి స్కోరే. కానీ భారత బ్యాటర్లు ఒకసారి దూకుడుగా ఆడటం మొదలుపెడితే వారిని ఆపడం ఎవరివల్లూ కాదని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వెల్లడించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, మ్యాచ్ చివర్లో మంచు (Dew) కురవడంతో బౌలింగ్ చేయడం, పరుగులను నియంత్రించడం చాలా కష్టమైందని చెప్పుకొచ్చాడు.

►ALSO READ | 5 ఓవర్లలో 100 రన్స్ అంటే మామూలు విషయం కాదు.. అభిషేక్, వైభవ్ దూకుడుకు శ్రేయస్ అయ్యర్ షాక్

నెక్ట్స్ మ్యాచుల్లో వ్యూహాలపై శాంట్నర్ ఫోకస్: 

టీమిండియా బ్యాటర్ల విధ్వంసాన్ని అడ్డుకోవడానికి తాము సరికొత్త ప్రణాళికలు వేయాల్సిన అవసరం చాలా ఉందని కివీస్ కెప్టెన్ శాంట్నర్ తేల్చి చెప్పాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో మైకేల్ బ్రేస్‌వెల్‌తో బౌలింగ్ చేయించాం.. కానీ వారు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇండియన్ బ్యాటర్లను అడ్డుకునేందుకు మేము మరిన్ని ప్లాన్స్ రచించాల్సిందేనని పేర్కొన్నాడు. తర్వాత మ్యాచ్ ఈడెన్ పార్క్‌లో జరగనున్న నేపథ్యంలో, అక్కడి చిన్న స్టేడియంలో భారత దూకుడును కట్టడి చేసేందుకు కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తామని మిచెల్ శాంట్నర్ తెలిపాడు.