- జనవరి నుంచి పనులు ప్రారంభించేలా కసరత్తు
- వారం, పది రోజుల్లో జనరల్ కన్సల్టెంట్ ఖరారు
- 93 % స్థల సేకరణ పూర్తి.. త్వరలో మిగతావి
- 2,886 కోట్లతో 7.5 కి.మీ కారిడార్– 6
- చారిత్రక కట్టడాలకు నష్టం కలగకుండా లైన్ డిజైనింగ్
హైదరాబాద్, వెలుగు: పాతబస్తీ వాసుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. వచ్చే జనవరి నుంచే ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణ పనులు ప్రారంభించేలా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రో రెండో దశకు అనుమతులు, రుణాల సమీకరణ అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండటంతో సంబంధం లేకుండా ఓల్డ్ సిటీ మెట్రో పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశించారు. దీంతో అధికారులు పనుల వేగం పెంచారు. మరో వారం, పది రోజుల్లో జనరల్ కన్సల్టెంట్‌ను ఖరారు చేయడంతోపాటు, నెల రోజుల్లో మిగిలిన భూసేకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి నుంచే పిల్లర్ల నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హెచ్‌ఏఎంఎల్ అధికారులు చెబుతున్నారు.
జీసీ రేసులో రెండు కన్సార్షియాలు
మెట్రో ఫేజ్-2 ప్యాకేజీ-1లోని 63 కిలోమీటర్ల నాలుగు కారిడార్లకు ఇంజినీరింగ్, డిజైన్లు, టెండర్ల పర్యవేక్షణ బాధ్యతలు చూసే జనరల్ కన్సల్టెంట్ (జీసీ) ఎంపిక కీలక దశకు చేరింది. ఇందులో భాగంగా ఓల్డ్ సిటీ కారిడార్-6లోని ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట మార్గం పనులనూ వేగవంతం చేయనున్నారు. సాంకేతిక నిబంధనలు, గడువు పొడిగింపుల తర్వాత దాఖలైన అంతర్జాతీయ బిడ్లలో రెండు కన్సార్షియాలు పోటీలో ఉన్నాయి. ఆర్వీ అసోసియేట్స్–అయేసా సంస్థల కూటమి ఒక బిడ్ వేయగా, టైప్సా–నిప్పన్ కోయ్–హిల్ ఇంటర్నేషనల్ కన్సార్షియం మరో బిడ్ దాఖలు చేసింది. వీటిలో ఒక సంస్థను మరో వారం రోజుల్లో జీసీగా ఖరారు చేయనున్నారు.
మొత్తం 888 ఆస్తుల్లో 833 సేకరణ పూర్తి
జీసీ నియామకం పూర్తికాగానే నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో పాతబస్తీ మెట్రో సివిల్ పనులకు డిజైన్ అండ్ బిల్డ్ (ఈపీసీ) విధానంలో ప్రత్యేక టెండర్లు పిలవనున్నారు. నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థతో జనవరి నుంచే భూగర్భ పైలింగ్, పిల్లర్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. పనుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన చోట్ల దారి మళ్లింపులు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 888 ఆస్తులు సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 833 ఆస్తుల సేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన 55 ఆస్తుల్లో కొన్ని వారసత్వ కట్టడాలు కాగా, మరికొన్ని కోర్టు కేసులతో ముడిపడి ఉన్నాయి. డిసెంబర్ నాటికి భూసేకరణ మొత్తం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రత్యేక టెక్నాలజీతో రూట్ డిజైన్
రూ.2,886 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ 7.5 కిలోమీటర్ల మార్గంలో ఆరు ఎలివేటెడ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, అలియాబాద్ (షంషీర్‌గంజ్, జంగమ్మెట్), ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్టలో వీటిని నిర్మిస్తారు. చారిత్రక కట్టడాలకు నష్టం కలగకుండా ప్రత్యేక టెక్నాలజీతో మార్గాన్ని డిజైన్ చేస్తున్నారు. భవిష్యత్తులో చాంద్రాయణగుట్ట వద్ద ఈ కారిడార్ నాగోల్–శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గానికి జంక్షన్‌గా మారనుంది. రెండో దశ పూర్తయితే ఓల్డ్ సిటీ ప్రజలకు శంషాబాద్ విమానాశ్రయంతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాలకూ మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
