నవంబర్ 1 నుంచి 10 లక్షల వాహనాలకు ఢిల్లీలోకి నో ఎంట్రీ !

నవంబర్ 1 నుంచి 10 లక్షల వాహనాలకు ఢిల్లీలోకి నో ఎంట్రీ !

నవంబర్ 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు ఢిల్లీ నగరంలోకి 10 లక్షలకు పైగా వాహనాలను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన BS6 కాని వాహనాలకు నవంబర్ 1 నుంచి నో ఎంట్రీ. శీతాకాలంలో కాలుష్యాన్ని అరికట్టడానికి సరిహద్దు తనిఖీలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నుంచి ఢిల్లీలోకి వచ్చే 10 లక్షలకు పైగా వాహనాలపై ఈ నిషేధ ప్రభావం పడనుంది.

ఈ నిషేధం.. ఢిల్లీలో లేని, BS6 ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలకు వర్తిస్తుంది. ఢిల్లీలోకి BS6 కాని వాహనాలు రాకుండా నియంత్రించడానికి.. ANPR కెమెరాలు, AI-ఆధారిత సాంకేతికత, సిబ్బందిని ఉపయోగించనున్నారు. వీరు నిషేధిత వాహనాలను దేశ రాజధాని నగరంలోకి ప్రవేశించకుండా నిరోధించడంలో సహాయపడతారని భావిస్తున్నారు.

గుర్గావ్, ఫరీదాబాద్‌లలో BS6 ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల మొత్తం సంఖ్య దాదాపు 2 లక్షలు. ఈ మొత్తం సంఖ్యలో, 70% BS3, BS4 వాహనాలే ఉన్నాయి. గుర్గావ్, ఫరీదాబాద్‌లలో BS6 ప్రమాణాలకు అనుగుణంగా లేని 50 వేల కమర్షియల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. నోయిడా & గ్రేటర్ నోయిడాలో 4 లక్షలకు పైగా BS6 ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం వాహనాలు BS4 వర్గానికి చెందినవే.

►ALSO READ | రాష్ట్రపతి భవన్ సమీపంలోని సెక్రటేరియట్ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం

ఈ వాహనాలలో చాలా వరకు పెట్రోల్ బండ్లే కావడం గమనార్హం. NCR ప్రాంతంలోని పొరుగు నగరాల నుంచి ఢిల్లీకి వచ్చే రోజువారీ ప్రయాణికులకు, వాణిజ్య రవాణాదారులకు ఈ పరిమితులు వర్తించవచ్చు. ఢిల్లీలో ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1, 2026 నుండి జనవరి 31, 2027 వరకు మూడు నెలల కాలానికి వర్తిస్తాయి.