కేరళలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందల ఐఫోన్లు మాయం.. విచారణకు ఆదేశించిన సతీశన్ సర్కార్

కేరళలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందల ఐఫోన్లు మాయం.. విచారణకు ఆదేశించిన సతీశన్ సర్కార్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐఫోన్లు మాయమవడం తీవ్ర కలకలం రేపుతోంది. వైద్య అవసరాల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి కొన్న వందల ఐఫోన్లలో సగానికి పైగా కనిపించకుండాపోయాయి. అలాగే, సర్కార్ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన వైద్య పరికరాలు నిరూపయోగంగా పడి ఉండటం వైద్యశాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు వృధాగా పడి ఉండటం, ఐఫోన్‌లు గల్లంతవడంపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

కంటి పరీక్షల నిమిత్తం వాడే ఫండస్ కెమెరాల నిర్వహణ కోసం రూ.7.16 కోట్ల వ్యయంతో ప్రభుత్వం 224 ఐఫోన్‌లను కొనుగోలు చేసింది. అయితే, ఈ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి, సగం ఫోన్లు మిస్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిన్ వర్కీ కొడియాట్టు ఐఫోన్ల మిస్సింగ్‎పై అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు. దీనికి కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ సమాధానం ఇచ్చారు. 

►ALSO READ | ఫస్ట్ షాట్ కొట్టిన విజయ్ ప్రభుత్వం.. రూ. 100 కోట్ల స్కాం కేసులో తమిళనాడు  మాజీ విద్యా శాఖ మంత్రి అరెస్ట్

ఫోన్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతి, ప్రజాధనం దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో దర్యాప్తునకు ఆదేశించారు. కేవలం ఐఫోన్‌లు మాత్రమే కాకుండా కోవిడ్ సమయంలో పీఎం కేర్స్ కింద సరఫరా చేసిన 128 వెంటిలేటర్లు కూడా నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిరూపయోగంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఘటనపైన విచారణకు ఆదేశించనున్నట్లు పేర్కొన్నారు.