ఫస్ట్ షాట్ కొట్టిన విజయ్ ప్రభుత్వం.. రూ. 100 కోట్ల స్కాం కేసులో తమిళనాడు  మాజీ విద్యా శాఖ మంత్రి అరెస్ట్

ఫస్ట్ షాట్ కొట్టిన విజయ్ ప్రభుత్వం.. రూ. 100 కోట్ల స్కాం కేసులో తమిళనాడు  మాజీ విద్యా శాఖ మంత్రి అరెస్ట్

రూ. 100 కోట్ల అవినీతి కేసులో తమిళనాడు మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని ప్రైవేట్ పాఠశాలలకు సదరు విద్యా శాఖ మాజీ మంత్రి రూ.100 కోట్ల లంచం తీసుకుని చట్టవిరుద్ధంగా లైసెన్సులు, అనుమతులు జారీ చేశారనే ఆరోపణలపై అన్బిల్ను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ అవినీతి కేసులో 177 ప్రైవేట్ పాఠశాలల పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

వెయ్యికి పైగా ప్రైవేట్ పాఠశాలల ఆమోదాలు, అనుమతులకు సంబంధించిన రూ. 100 కోట్ల కుంభకోణంలో డీఎంకే నేత,  తమిళనాడు మాజీ విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి పేరు ప్రధానంగా వినిపించింది. 2021-2026 పదవీకాలంలో పాఠశాలలకు శాశ్వత గుర్తింపు ఇచ్చేందుకు పార్టీ నిధుల ముసుగులో డబ్బు వసూలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఆయన ముందస్తు బెయిల్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని డీఎంకే ఆరోపించింది.

మద్రాస్ హైకోర్టు సోమవారం మహేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత ఈ అరెస్టు జరిగింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వి. లక్ష్మీనారాయణ్ తిరస్కరించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ మహేష్ విడిగా కోర్టును ఆశ్రయించారు.