చెరువుల చెంత అక్రమ బోర్లపై హైడ్రా దాడులు చేసింది. శిల్పారామం ఎదురుగా తమ్మిడికుంట దగ్గర 6 బోర్లను తొలగించింది. తమ్మిడికుంట దిగువన ప్రభుత్వ భూమిలో అక్రమ నీటి దందాకు హైడ్రా చెక్ పెట్టింది. మోటార్లు, పైపులైన్లతో సహా 6 బోర్లను తొలగించింది. ప్లాస్టిక్ షీట్లతో ఏర్పాటు చేసిన నీటి మడుగుకు నీటి సరఫరా నిలిపివేసింది. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై హైడ్రా చర్యలు తీసుకుంది.
✳️ HYDRAA took action against illegal groundwater extraction near Sunnam Cheruvu, where borewells installed inside houses, bedrooms and kitchens were being used to extract water for commercial sale through underground pipelines. In a joint operation with CMC, Revenue and Water Board officials, HYDRAA removed illegal borewells and curbed unauthorised water trading to protect groundwater resources and safeguard public health from potentially contaminated water. #HYDRAA #SunnamCheruvu #GroundwaterProtection #WaterConservation #IllegalWaterTrade
— HYDRAA (@Comm_HYDRAA) October 25, 2026
మొన్న మాదాపూర్‌లోని సున్నం చెరువు దగ్గర హైడ్రా తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు (అక్టోబర్ 26, 2026) సున్నం చెరువు దగ్గర మరో 10 అక్రమ బోర్లను హైడ్రా సిబ్బంది తొలగించారు. సున్నం చెరువు దగ్గర ఇప్పటివరకు 25 బోర్లను హైడ్రా తొలగించింది. తమ్మిడికుంట, సున్నం చెరువుల దగ్గర ఇప్పటికి మొత్తం 31 అక్రమ బోర్లను తొలగించారు.
చెరువు చుట్టూ బోర్లు.. ఇండ్లలో మోటార్లు.. భూగర్భంలో వందల మీటర్ల పైపులైన్లు.. ఇలా మాదాపూర్‌లోని సున్నం చెరువును ఆనుకొని ఏండ్లుగా నీళ్ల దందా సాగిస్తున్నది ఓ ముఠా. సుమారు 30 మంది ముఠాగా ఏర్పడి రోజూ 300 నుంచి 400 ట్యాంకర్ల నీటిని తోడేస్తూ అమ్ముకుంటున్నరు. నివాసాల ముసుగులో బోర్లు వేసి, ప్రమాదకర లోహాలున్న నీటిని సైతం హాస్టళ్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా, రెవెన్యూ, సీఎంసీ, జలమండలి అధికారులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొన్ని బోర్లను పూర్తిగా తొలగించగా, మరికొన్నింటి మోటార్లు, విద్యుత్ వైర్లు, పైపులైన్లను తొలగించారు. అక్రమ దందా సాగిస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు ట్యాంకర్లను సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
సున్నం చెరువు అభివృద్ధిలో భాగంగా 10 అడుగుల మేర పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు పరిస్థితులు మెరుగయ్యాయి. అయితే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో బోర్లు వేసి నీటిని తోడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. గతంలో 60 అడుగుల లోతులోనే పుష్కలంగా నీరు లభించేదని, ఇప్పుడు 600 అడుగుల వరకు తవ్వినా నీరు పడటం లేదని స్థానికులు చెబుతున్నారు.
బోర్లు ఎండిపోవడం, నీటిని తోడే క్రమంలో మోటార్లు కాలిపోవడంతో తామూ డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీరు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో నవభారత్‌నగర్, బోరబండ ఫేజ్-3 ప్రాంతాల్లో అధికారులు అక్రమ బోర్ల తొలగింపు చేపట్టారు. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
